హైదరాబాద్, మహా : ఒక సమాజం ఎంత పురోగతి సాధించిందనేది ఆ సమాజంలోని మహిళలు సాధించిన అభివృద్ధిని బట్టే తాను కొలుస్తానన్న అంబేద్కర్ మాటలను ప్రతి ఒక్కరూ మనసా వాచా స్మరించుకోవాలని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి అన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశంగా నిలవడానికి అంబేద్కర్ అందించిన అత్యున్నత రాజ్యాంగమే కారణమని ఆయన కొనియాడారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించి, రాజ్యాంగ రక్షణ అందించిన మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, బాధ్యత కలిగిన పౌరులుగా జీవించడమే మనం ఆ మహనీయునికి ఇచ్చే అసలైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా, సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం పట్ల మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ సానుకూలంగా ఉందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. కార్మికులు, సిబ్బంది ఎవరూ కూడా అనవసర ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, సిబ్బంది సమస్యలను పరిష్కరించడమే సంస్థ యొక్క ప్రధాన ధ్యేయమని ఆయన భరోసా ఇచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ కళాభవన్ లో అత్యంత ఘనంగా నిర్వహించింది.








