Mahaa Daily Exclusive

  నిప్పుల కొలిమిలా తెలంగాణ.. నల్గొండలో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత..

Share

హైదరాబాద్, మహా.

రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఏప్రిల్ మధ్యలోనే ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా, రాజధాని హైదరాబాద్‌లోనూ 41 డిగ్రీల మేర సెగలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నల్గొండ జిల్లా అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతతో అగ్రస్థానంలో నిలిచింది. జగిత్యాలలో 43.4 డిగ్రీలు నమోదు కాగా, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల మేర ఎండ తీవ్రత కొనసాగింది. ఆదిలాబాద్‌లో 43.2 డిగ్రీలు, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, సిరిసిల్ల , సంగారెడ్డి జిల్లాల్లో 42.8 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గద్వాల, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ మరియు పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది, అక్కడ 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

భాగ్యనగరంలో కూడా ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా మండిపోతోంది. నగర శివార్లతో పాటు ప్రధాన ప్రాంతాల్లో జనం మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. హయత్‌నగర్‌లో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సంతోష్ నగర్, బేగంపేట ప్రాంతాల్లో 40.9 డిగ్రీల మేర ఎండలు కాశాయి. షేక్‌పేట, ఆర్సీ పురం, సికింద్రాబాద్, ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో 40.8 డిగ్రీలు, సరూర్ నగర్‌లో 40.7, ముషీరాబాద్ మరియు శేరిలింగంపల్లిలో 40.6, ఉప్పల్ మరియు కూకట్‌పల్లిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఇలాంటి తీవ్రమైన ఉష్ణోగ్రతలే కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

Latest