Mahaa Daily Exclusive

  మహిళా బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు: దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకోమని కేసీఆర్ హెచ్చరిక..

Share

  • మహిళా బిల్లుకు ‘గులాబీ’ మద్దతు.
  • దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకోం.
  • సీట్ల పెంపుపై సమగ్ర పరిశీలన అవసరం.
  •  2011 జనాభా లెక్కల ప్రాతిపదికపై అభ్యంతరం
  • కేటీఆర్‌, హరీశ్‌రావులతో భేటీలో కేసీఆర్‌ స్పష్టీకరణ.

హైదరాబాద్‌, మహా.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఎంతమాత్రం అంగీకరించబోమని పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. బుధవారం తన నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులతో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలతో పాటు రాబోయే పార్టీ కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
**తొలి నుంచీ మహిళా రిజర్వేషన్లకే మొగ్గు**
మహిళా రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ వైఖరి అత్యంత స్పష్టంగా ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. తాము అధికారంలో ఉన్న తొలి కాలంలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపామని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టే మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు సంపూర్ణ మద్దతు తెలపాలని ఆయన ఆదేశించారు. మహిళా సాధికారత దిశగా పడే ఏ అడుగునైనా తమ పార్టీ స్వాగతిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
**డీలిమిటేషన్ ప్రక్రియపై లోతైన విశ్లేషణ**
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పార్టీ ఒక తుది నిర్ణయానికి వస్తుందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ బిల్లు వల్ల అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు సుమారు 24 శాతం ప్రాతినిధ్యం ఉందని, నియోజకవర్గాల విభజన తర్వాత ఈ శాతం తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. దక్షిణాది సీట్ల సంఖ్యను కనీసం 50 శాతం పెంచాలని, అప్పుడే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుందని ఆయన ఆకాంక్షించారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ నిర్వహిస్తే జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోతాయని, ఈ విషయంలో సమగ్ర అధ్యయనం జరిగే వరకు కేంద్రం ఎలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదని కేసీఆర్ స్పష్టం చేశారు.
**శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు**
రాజకీయ అంశాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై కేసీఆర్ నేతలతో చర్చించారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కేటీఆర్, హరీష్ రావులకు సూచించారు. అలాగే, ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది.