- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు హైకోర్టులో చుక్కెదురు.
- పాస్‌పోర్ట్‌పై షరతులతో కూడిన ఆదేశాలు.
- ట్రయిల్ కోర్టు నుంచి ఎన్‌వోసీ ఉంటేనే జారీ చేయాలి.
- విదేశీ ప్రయాణాలకు అనుమతి తప్పనిసరి.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర ప్రభుత్వ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పాస్‌పోర్ట్ జారీ వ్యవహారంలో హైకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న క్రిమినల్ కేసుల నేపథ్యంలో పాస్‌పోర్ట్ జారీకి అథారిటీ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేస్తూ, నిబంధనల ప్రకారం ట్రయిల్ కోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో నమోదైన కొన్ని క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో పాస్‌పోర్ట్ అథారిటీ ఆయనకు పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు నిరాకరించగా, తనకు జారీ చేసేలా అథారిటీని ఆదేశించాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే, చట్టపరమైన ప్రక్రియను దాటి నేరుగా ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనపై కేసులు నడుస్తున్న ట్రయిల్ కోర్టును ఆశ్రయించి, పాస్‌పోర్ట్ జారీకి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (ఎన్‌వోసీ) పొందాలని హైకోర్టు సూచించింది. ట్రయిల్ కోర్టు నుంచి ఎన్‌వోసీ సమర్పించిన పక్షంలోనే పాస్‌పోర్ట్ అథారిటీ ఆయనకు పాస్‌పోర్ట్ జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడు జారీ చేసే ఎన్‌వోసీ కేవలం పాస్‌పోర్ట్ పొందడానికే ఉపయోగపడుతుందని, దానిని విదేశాలకు వెళ్లేందుకు అనుమతిగా భావించకూడదని కోర్టు వివరించింది. ఒకవేళ మంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటే, ప్రతిసారీ ట్రయిల్ కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ, చట్టపరమైన నిబంధనలు అందరికీ వర్తిస్తాయని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.







