Mahaa Daily Exclusive

  జెప్టో డెలివరీలో మోసం: నూనె ఆర్డర్ చేస్తే నీళ్లు వచ్చాయి.. కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయిస్తానన్న బాధితుడు.

Share

  • ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్‌లో ‘నీళ్లు’.
  • జెప్టో డెలివరీపై వినియోగదారుడి ఆగ్రహం.
  • నూనె ఆర్డర్ చేస్తే నీళ్లు వచ్చాయి.
  • కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయిస్తానన్న బాధితుడు.

హైదరాబాద్‌, మహా
నగరంలోని బోడుప్పల్‌ పరిధిలో ఒక విచిత్రమైన ఉదంతం వెలుగుచూసింది. ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌ల ద్వారా సరుకులు ఆర్డర్‌ చేసే వినియోగదారులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన అద్దం పడుతోంది. బోడుప్పల్‌కు చెందిన శరత్ యాదవ్ అనే వ్యక్తి జెప్టో యాప్ ద్వారా ఐదు లీటర్ల ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ క్యాన్‌ను ఆర్డర్ చేయగా, తీరా డెలివరీ వచ్చిన తర్వాత ఆ క్యాన్ తెరిచి చూసి ఆయన కంగుతిన్నారు. అందులో నూనెకు బదులుగా నీళ్లు ఉండటంతో ఒక్కసారిగా విస్తుపోయారు. ప్యాకింగ్ సక్రమంగానే ఉన్నట్లు కనిపించినా, లోపల నూనె మాయమై నీళ్లు రావడం వినియోగదారుడిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ మోసంపై ఫిర్యాదు చేసేందుకు శరత్ యాదవ్ జెప్టో ప్రతినిధులను సంప్రదించే ప్రయత్నం చేయగా, వారి నుంచి ఎలాంటి సానుకూల స్పందన లభించలేదు. కనీసం ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కంపెనీకి చెందిన బ్రాండెడ్ ఆయిల్ క్యాన్‌లో ఇలాంటి అవకతవకలు జరగడం పట్ల డెలివరీ సంస్థ బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బులు వసూలు చేయడమే తప్ప నాణ్యమైన వస్తువులను వినియోగదారులకు చేరవేయడంలో డెలివరీ యాప్‌లు విఫలమవుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఊరుకునే ప్రసక్తే లేదని, తనకు జరిగిన అన్యాయంపై కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తానని శరత్ యాదవ్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్ మోసాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Latest