Mahaa Daily Exclusive

  మెగా కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు….  యూపీలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్…..

Share

కాకినాడ,మహా.
సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న వారిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొరడా ఝుళిపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, అలాగే మెగా కుటుంబ సభ్యురాలు నిహారిక కొణిదెల విడాకుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. పవన్ కల్యాణ్ మూడు వివాహాలను ఎద్దేవా చేస్తూ, నిహారిక విడాకుల అంశాన్ని దానికి జోడిస్తూ అనుదీప్ రూపొందించిన వీడియోలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు తమ నాయకుడి ప్రతిష్ఠను భంగం కలిగించేలా ఉన్నాయంటూ జనసేన వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ వ్యవహారంపై జనసేన పార్టీ నాయకుడు బడే వెంకట కృష్ణ కాకినాడ ఐ-టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని, దీనివల్ల సదరు వ్యక్తుల గౌరవ మర్యాదలకు భంగం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించిన కాకినాడ పోలీసులు, అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కాకినాడకు తరలించి తదుపరి విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాలపై బురదజల్లడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Latest