Mahaa Daily Exclusive

  పరిగిలో భూపోరు రణరంగం: రైతులకు మద్దతుగా నిలిచిన కవిత అరెస్ట్.. భూసేకరణపై పతాక స్థాయికి చేరిన నిరసన

Share

పరిగిలో భూపోరు..
*రణరంగంగా ఆర్డీవో కార్యాలయం.
*రైతులకు మద్దతుగా దిగిన కవిత అరెస్ట్.
*పతాక స్థాయికి చేరిన భూసేకరణ నిరసన..

వికారాబాద్, మహా.
వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటం ఉగ్రరూపం దాల్చింది. బుధవారం పరిగి ప్రాంతం పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన తోపులాటలతో ఒక్కసారిగా రణరంగంగా మారింది. తమ సారవంతమైన భూములను పరిశ్రమల కోసం వదులుకోవడానికి సిద్ధంగా లేమని గత కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టిన రైతులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిగి ఆర్డీవో కార్యాలయం ముట్టడికి యత్నించిన కవితను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తరలించారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా కేంద్రంలో పెను ఉత్కంఠకు దారితీశాయి.
వందలాది మంది రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు కవిత ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గంటల తరబడి తోపులాట చోటుచేసుకుంది. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు కవితను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే జాగృతి కార్యకర్తలు, రైతులు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర హైడ్రామా నెలకొంది. చివరకు పోలీసులు కవితను బలవంతంగా వాహనం నుంచి కిందకు దించి, పోలీసు వాహనంలో వేరే ప్రాంతానికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరగడంతో కొందరు రైతులు స్వల్పంగా గాయపడ్డారు.
అరెస్టుకు ముందు కవిత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రైతుల పొట్ట కొట్టి పరిశ్రమలు కట్టడం ఏంటని ఆమె నిలదీశారు. అన్నదాతలు ప్రాణాలకు తెగించి తమ సాగు భూములను కాపాడుకుంటుంటే, వారిపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల భూములు కాపాడే వరకు తమ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం కవిత అరెస్టుతో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కవితను తరలించిన సమాచారంతో జాగృతి శ్రేణులు ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేపట్టడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా కేంద్రంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వ భూసేకరణ నిర్ణయంపై రైతుల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడంతో, ఈ వివాదం మున్ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.