*విద్యార్థుల భద్రతే అత్యంత ప్రాధాన్యం*
*ప్రైవేట్ స్కూల్స్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి*
*వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద*
మహా వరంగల్ బ్యూరో;
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమం కింద ప్రైవేట్ స్కూల్ డ్రైవర్స్ యూనియన్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) వై.వి. గణేష్, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీఈవో రంగయ్య నాయుడు, డిబిసిడిఓ పుష్పలత, ట్రాఫిక్ సీఐ సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ప్రైవేట్ స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయకుండా, మద్యం సేవించి వాహనం నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. స్కూల్ బస్సుల్లో డ్రైవర్ తో పాటు క్లీనర్ తప్పనిసరిగా ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే వాహనాల హెడ్‌లైట్లకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అమర్చడం, బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు కలిగి ఉండటం వంటి అంశాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. హైవే రోడ్ల కూడళ్ల వద్ద ఉన్న పాఠశాలల సమీపంలో “స్కూల్ జోన్” సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా రిక్వెస్ట్ లెటర్లు తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని డీఈవో రంగయ్య నాయుడుకు సూచించారు.
సమీక్ష సమావేశంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే వీడియోలను పీపీటీ ద్వారా ప్రదర్శించారు. అధికారులు మాట్లాడుతూ ప్రాణం అమూల్యమైందని, ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రైవర్ల తో పాటు క్లీనర్లు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని తెలిపారు.
అనంతరం సమావేశంలో పాల్గొన్న వారితో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సుజాత, మండలాల ఎంఈఓలు, ఆర్టీఏ అధికారులు, ఎస్సై వేణు, ప్రైవేట్ స్కూల్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








