న్యాయస్థానంలో వణికిన ‘అగ్రరాజ్యం’.
• సంకెళ్లతో కోర్టులో 91 ఏళ్ల బామ్మ.
• భర్త ప్రాణాల కోసం దొంగతనం.
• 65 ఏళ్ల ప్రేమపై ఇనుప సంకెళ్లు.
• బామ్మ సంకెళ్లతో కదిలిన మానవత్వం!
• నేరస్థురాలు కాదు.. వ్యవస్థ వైఫల్యం.
• సంకెళ్లు తెంచేసిన జడ్జి సంచలన తీర్పు!
వాషింగ్టన్,మహా.
న్యాయం, రాజకీయం, వ్యవస్థ.. ఈ పదాలన్నింటికీ అసలు అర్థాన్ని ఒకే ఒక్క నిమిషంలో మార్చేసింది ఆ వృద్ధురాలు. నేడు అమెరికాలోని ఒక కోర్టు గదిలో 91 ఏళ్ల హెలెన్ సంకెళ్లతో నిలబడిన దృశ్యం వేయి ప్రసంగాల కంటే శక్తివంతంగా వ్యవస్థ వైఫల్యాన్ని ఎండగట్టింది. 65 ఏళ్ల పాటు తన భర్త జార్జ్‌తో కలిసి ఎంతో క్రమశిక్షణతో, సామాన్యంగా జీవించిన హెలెన్‌కు, తన జీవిత చరమాంకంలో ఇలా కోర్టు బోనులో నిలబడతానని కలలో కూడా ఊహించి ఉండదు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన భర్తను కాపాడుకోవడమే ఆమె చేసిన ఏకైక ‘నేరం’. రోజుకు 12 మాత్రలు వేసుకుంటే తప్ప ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న తన భర్త ప్రాణాలను కాపాడటం కోసం ఆ బామ్మ పడిన ఆవేదన ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది.
**50 డాలర్ల మందు.. 940 డాలర్ల మంట!**
హెలెన్ దంపతులు తమకున్న కొద్దిపాటి ఆదాయంతోనే మందుల ఖర్చులను భరిస్తూ వచ్చేవారు. సాధారణంగా ఇన్సూరెన్స్‌తో కలిపి 50 డాలర్లు ఉండే ఆ మందుల ధర, ఒక్కసారిగా 940 డాలర్లకు (సుమారు రూ. 78 వేలకు పైగా) చేరుకుంది. ఒక ఇన్సూరెన్స్ పేమెంట్ మిస్ అవ్వడంతో ఆ మందుల ధర సామాన్యుడికి అందనంత దూరానికి వెళ్ళిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేక ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లిన హెలెన్, మూడు రోజుల పాటు తన భర్త కళ్ళముందే విలవిలలాడటం చూసి తట్టుకోలేకపోయింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న భర్తను చూసి తట్టుకోలేక, గజగజ వణికిపోతున్న చేతులతో ఆ మందుల షాపులో మాత్రల డబ్బాను తన పర్సులో వేసుకుంది. అదే ఆమె చేసిన తప్పుగా మారిపోయింది.
**ఆసుపత్రి బెడ్ నుంచి కోర్టు బోను వరకు.**
దొంగతనం చేస్తూ దొరికిపోయిన హెలెన్‌ను పోలీసులు నేరస్థురాలిలా అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్బంధంలో ఆమె రక్తపోటు అమాంతం పెరగడంతో ఆసుపత్రికి తరలించారు. చివరకు ఆసుపత్రి గౌనులో ఉన్న ఆ వృద్ధురాలిని, చేతులకు సంకెళ్లు వేసి మరీ కోర్టుకు తీసుకువచ్చారు. ఆ దృశ్యాన్ని చూసిన కోర్టులోని ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. 91 ఏళ్ల వృద్ధురాలికి, భర్త ప్రాణాలు కాపాడుకోవాలన్న తపన తప్ప మరొక ఆలోచన లేని ఆ మాతృమూర్తికి సంకెళ్లు వేయడం అక్కడున్న వారి మనసులను కలచివేసింది.
**న్యాయమూర్తి ఆవేదన.. వ్యవస్థకు చెంపదెబ్బ!**
బోనులో నిలబడిన హెలెన్ వైపు చూడగానే న్యాయమూర్తి గుండె కరిగిపోయింది. ఆయన అక్కడ ఒక దొంగను చూడలేదు.. మానవత్వం మంటగలిసిన వ్యవస్థలో బలిపశువుగా మారిన ఒక ఆత్మను చూశారు. వెను వెంటనే ఆమె చేతులకున్న సంకెళ్లను తొలగించాలని ఆదేశించిన జడ్జి, ఆమెపై ఉన్న అన్ని కేసులను కొట్టివేశారు. జార్జ్ , హెలెన్‌లకు కావాల్సిన మందులు, సంరక్షణను ఉచితంగా అందించాలని సోషల్ వర్కర్లను ఆదేశించారు. ఆ సమయంలో జడ్జి చెప్పిన మాటలు కోర్టు హాలును దద్దరిల్లేలా చేశాయి. “ఈమె నేరస్థురాలు కాదు.. ఇది మన వ్యవస్థ వైఫల్యం” అని ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యపు అహంకారాన్ని ప్రశ్నించాయి.
బలవంతులకు రక్షణ కవచంలా ఉండి, బలహీనులను వేధించే వ్యవస్థలు ఏ దేశానికైనా ప్రమాదకరమే. హెలెన్ కథ కేవలం ఆమెది మాత్రమే కాదు.. ఇలాంటి సంక్లిష్టమైన, మానవత్వం లేని వ్యవస్థల మధ్య నలిగిపోతున్న లక్షలాది మంది సామాన్యులది.








