Mahaa Daily Exclusive

  నా అనుమతి లేకుండా పేరు, గొంతు వాడొద్దు…..

Share

నా అనుమతి లేకుండా పేరు, గొంతు వాడొద్దు.
* దిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్‌ దావా!**
*వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరిన ‘పుష్ప’రాజ్.
*ప్రముఖుల జాబితాలో ఐకాన్ స్టార్.
ఢిల్లీ, మహా.

తన పేరు, రూపం, గొంతు మరియు వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలను వాణిజ్యపరంగా దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ దిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కారు. తన అనుమతి లేకుండా తన చిత్రపటాలను, గొంతును లేదా తన వ్యక్తిత్వానికి సంబంధించిన ఏవైనా ఇతర అంశాలను ప్రకటనల కోసం, వ్యాపార లాభాల కోసం వాడటం సరికాదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, శుక్రవారం జస్టిస్ తుషార్ రావు గెదెలా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చేలా షెడ్యూల్ చేసింది. ఈ పరిణామం సినీ , వాణిజ్య రంగాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నటుడిగా తనకున్న గుర్తింపును, ప్రజాదరణను ఆసరాగా చేసుకుని అనేక సంస్థలు తన ప్రమేయం లేకుండా వస్తువులను విక్రయించడం లేదా ప్రచార కార్యక్రమాల్లో తన ఫొటోలను వాడుకోవడం పట్ల అల్లు అర్జున్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీ-షర్టులు, ఇతర వాణిజ్య వస్తువులపై తన ముద్రను వేసి సొమ్ము చేసుకుంటున్నారని, ఇది తన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆయన వాదిస్తున్నారు. తన వ్యక్తిత్వానికి సంబంధించిన ఏ అంశాన్నైనా వినియోగించుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరని, ఇందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ ద్వారా నటుడి కీర్తికి భంగం కలగకుండా చూడవచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు సినీ దిగ్గజాలు, ప్రముఖులు ఇటువంటి వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, కాజోల్ దేవ్ గన్, మాధవన్ వంటి ప్రముఖులతో పాటు క్రీడా దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఈ కోవలోనే కోర్టు నుంచి రక్షణ పొందారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఇదే తరహాలో దావా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో పయనిస్తూ తన బ్రాండ్ విలువను, వ్యక్తిగత హక్కులను కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.