Mahaa Daily Exclusive

  ఉద్యమ స్ఫూర్తిని రగల్చాలి….

Share

• కేసీఆర్ ఆమరణ దీక్షకు సాక్ష్యమైన గడ్డ నుంచే పోరుబాట.
* మినీ ప్లీనరీలో హరీశ్ రావు పిలుపు.
* ఘనంగా పువ్వాడ అజయ్ జన్మదిన వేడుకలు.
ఖమ్మం, మహా.
ఖమ్మం జిల్లా వేదికగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శ్రేణులు సమరశంఖం పూరించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినీ ప్లీనరీ సమావేశం నాయకులు, కార్యకర్తల నడుమ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కీలక సమావేశానికి మాజీ మంత్రి, శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ, ఆ పార్టీని రాజకీయంగా మట్టికరిపించేందుకు నాయకులంతా భేదాభిప్రాయాలు విడనాడి ఒక్కతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఖమ్మం జిల్లాకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ ఘట్టంలో పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షకు ఖమ్మం జిల్లానే సజీవ సాక్ష్యంగా నిలిచిందని ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి నుంచే ఏ రకమైన ఉద్యమ స్ఫూర్తి రగిలిందో, నేడు సరిగ్గా అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరాడాలని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు. తెలంగాణకు గుమ్మం అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం అంతా ఏకతాటిపైకొచ్చి అధికార పార్టీపై రాజీలేని పోరాటం చేస్తామని ఈ ప్లీనరీ వేదికగా ప్రతినబూనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదే వేదికపై రాజకీయ తీర్మానాలతో పాటు పండుగ వాతావరణం సైతం నెలకొంది. మినీ ప్లీనరీ రోజే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు కావడంతో వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి హరీశ్ రావుతో సహా పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పువ్వాడ అజయ్‌కు ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.