* రూ.10 కే కార్పొరేట్ స్థాయి వైద్యం.
* నామమాత్రపు ధరలకే మెరుగైన వైద్య పరీక్షలు.
*రూ.1610 కోట్లతో సకల సదుపాయాలు.
* రెండు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఎయిమ్స్.
* జాతికి అంకితం చేసిన కేంద్ర ప్రభుత్వం.
మంగళగిరి,మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు ఒక మహా వరంగా మారింది. సుమారు 183 ఎకరాల సువిశాలమైన, పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో రూ. 1610 కోట్ల భారీ వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని నిర్మించి జాతికి అంకితం చేసింది. ఏకంగా 960 పడకల సామర్థ్యంతో, 600 మందికి పైగా నిష్ణాతులైన వైద్యులు, సిబ్బందితో 24 గంటల పాటు నిరంతరాయంగా ఈ ఆసుపత్రి అత్యుత్తమ సేవలను అందిస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో, అంకితభావంతో పనిచేసే డాక్టర్లతో రోగులకు ఇక్కడ అద్భుతమైన వైద్యం అందుతోంది. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల ప్రజలు సైతం ఈ అరుదైన వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునే అద్భుత అవకాశం ఉంది.
ఈ ఆసుపత్రిలో రోగులకు అందించే వైద్య సేవలు, పరీక్షల ధరలు అతి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా నామమాత్రంగా నిర్ణయించారు. కేవలం పది రూపాయల ఓపీ (ఔట్ పేషెంట్) ఫీజు చెల్లించి జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కన్ను, చెవి, ముక్కు, గొంతు , దంత వైద్యం, చర్మవ్యాధులు తదితర ఎన్నో రకాల స్పెషలిస్ట్ విభాగాల్లో నిపుణులైన వైద్యులను సంప్రదించవచ్చు. ప్రస్తుతం న్యూరో విభాగం మినహా దాదాపు అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి, త్వరలోనే న్యూరో సేవలను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి చేరుకుంటే, మధ్యాహ్నం కల్లా వైద్య పరీక్షలు ముగించుకుని ప్రశాంతంగా వెనుతిరిగేలా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అలాగే ఆసుపత్రి ప్రాంగణంలోనే అత్యంత శుభ్రంగా నిర్వహించబడుతున్న క్యాంటీన్లో కేవలం 75 రూపాయలకే ఎంతో రుచికరమైన, నాణ్యమైన భోజనం రోగులకు, వారి బంధువులకు లభిస్తోంది.
మంగళగిరి ఎయిమ్స్‌కు చేరుకోవడం కూడా ప్రయాణికులకు ఎంతో సులభతరం. విజయవాడ నుంచి నేరుగా ఆసుపత్రికి బస్సు సౌకర్యం అందుబాటులో ఉండగా, మంగళగిరి బస్ స్టాండ్ నుంచి కేవలం 10 రూపాయల ఛార్జీతో బస్సులు, 30 నుంచి 50 రూపాయల ఛార్జీతో ఆటోలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. బయట ప్రైవేట్ ల్యాబ్‌లలో ఐదు వేల నుంచి పది వేల రూపాయల వరకు ఖర్చయ్యే ఖరీదైన వైద్య పరీక్షలు, ఎయిమ్స్‌లో కేవలం ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల లోపే పూర్తి చేయించుకోవచ్చు. ఆర్థిక స్థోమత లేని పేదలకు ఈ ఆసుపత్రి నిజంగా ఒక ఆశాకిరణం.







