Mahaa Daily Exclusive

  మొక్కజొన్న రైతన్నకు మహా ఊరట…

Share

* ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి.
* అన్నదాతలకు ఏమాత్రం ఇబ్బందులు రానివ్వొద్దు.
* మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అత్యవసర ఆదేశాలు.

హైదరాబాద్, మహా
రాష్ట్రంలో యాసంగి మొక్కజొన్న దిగుబడులు భారీగా మార్కెట్లకు పోటెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రైతన్నలు ఎంతో శ్రమించి పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చిన ఆయన, అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టారు. వ్యవసాయ మార్కెట్లకు, కొనుగోలు కేంద్రాలకు వస్తున్న మొక్కజొన్న పంట రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు.
**రైతుల సౌకర్యార్థం యుద్ధప్రాతిపదికన చర్యలు..**
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు వందల కొనుగోలు కేంద్రాల ద్వారా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయి. అయితే, దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఒక్కసారిగా భారీ ఎత్తున తమ పంటను విక్రయించేందుకు కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ఫలితంగా పలుచోట్ల తీవ్ర రద్దీ నెలకొంటోంది. దీనిని నివారించడానికి, రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాయకుండా ఉండేందుకు వీలుగా ఎక్కడికక్కడ అదనంగా కొత్త కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి తుమ్మల అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైతుల సౌకర్యార్థం అవసరమైన చోటల్లా తక్షణమే కొనుగోలు కేంద్రాలను విస్తరించడం ద్వారా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
**గోదాములకు తరలింపులో వేగం పెంచాలి..**
కొనుగోలు చేసిన మొక్కజొన్నను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన పంటను ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే గోదాములకు తరలించాలని మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులను ఆయన గట్టిగా ఆదేశించారు. రానున్న రోజుల్లో అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్నందున, ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట వానపాలు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన వెంటనే తగిన రవాణా సదుపాయాలను ఏర్పాటు చేసుకుని, పంటను సురక్షితంగా గోదాములకు చేర్చాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని, కొనుగోలు ప్రక్రియలో కింది స్థాయిలో కూడా ఎక్కడా జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.