* హరీష్ బతికుండగా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్.
ఖమ్మం, మహా.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సోమవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ హరీష్ రావు వ్యవహారశైలిపై, గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు లభించకపోవడం వల్లే హరీష్ రావు నానా తిప్పలు పడుతున్నారని, ప్రాధాన్యత కోసమే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
**రాష్ట్రాన్ని ‘రావణ కాష్టం’లా మార్చారు..**
గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారపూరిత పాలనతో రాష్ట్ర ప్రజల ఆశలపై మట్టి పోసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలను మోసం చేస్తూ, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని ఆయన విమర్శించారు. అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని ‘రావణ కాష్టం’లా మార్చేశారని తుమ్మల తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీని స్పష్టంగా గుర్తించిన ప్రజలు ఆ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారని.. హరీష్ రావు బతికుండగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు.
**కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు..**
వరంగల్‌లో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో కనీసం హరీష్ రావు ఫోటో కూడా లేకపోవడమే ఆయన దీనస్థితికి నిదర్శనమన్నారు. సొంత పార్టీలోనే ప్రాధాన్యత కోల్పోయిన ఆయన.. ఎక్కడికి వెళ్లినా పాత ‘ఆవు కథ’నే చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా అవినీతిమయం చేసి, రాష్ట్రాన్ని ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో నెట్టేసిన వారికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నీతులు చెప్పే నైతిక హక్కు ఏమాత్రం లేదని తుమ్మల స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 21 వేల కోట్లు రుణమాఫీ కింద వారి ఖాతాల్లో జమ చేసిందని.. దీనిపై కూడా విమర్శలు చేయడం హరీష్ రావు మానసిక స్థితికి అద్దం పడుతోందని మంత్రి ఎద్దేవా చేశారు.
**కమీషన్ల కోసమే సీతారామ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు..**
ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని అయిన సీతారామ ప్రాజెక్టుపై గత ప్రభుత్వ వైఫల్యాలను తుమ్మల నాగేశ్వరరావు బట్టబయలు చేశారు. సీతారామ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం రూ. 8 వేల కోట్లు నీళ్లపాలు చేసినప్పటికీ, ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేకపోయిందని ఆరోపించారు. ప్రాజెక్టు రూపకల్పనలో భారీ లోపాలు ఉన్నాయని, కేవలం కమీషన్ల కోసమే కేంద్ర అనుమతులు లేకుండా హడావుడిగా ప్రాజెక్టును ప్రారంభించి నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవితాశయమని ప్రకటించిన మంత్రి.. వచ్చే జూన్ నాటికి 16 వేల ఎకరాలకు, అలాగే పినపాక నియోజకవర్గంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని రైతులకు భరోసా ఇచ్చారు.







