మహా వరంగల్ బ్యూరో ;
వరంగల్ పరిధిలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు సబ్-రిజిస్ట్రార్ల అక్రమ వసూళ్ల బాగోతం బట్టబయలైంది. సబ్-రిజిస్ట్రార్-II దావులూరి ఆనంద్, సబ్-రిజిస్ట్రార్-I జలమాపురం రామనరసింహారావు తమ ఏజెంట్లుగా సుమారు 20 మంది ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లను అనధికారికంగా కార్యాలయంలోనే పెట్టుకుని, వారి ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజల నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేస్తూ.. ఆ మొత్తాన్ని ఫోన్ పే, యూపీఐ తో పాటు నగదు రూపంలో దర్జాగా తమ ఖాతాలకు మళ్లించుకున్నట్లు విచారణలో తేలింది. ఏప్రిల్ 2వ తేదిన జరిగిన ఆకస్మిక తనిఖీల్లో ఈ దళారుల వద్ద లభించిన లెక్కచూపని రూ.47,450 నగదుతో పాటు, అధికారుల మొబైల్ ఫోన్లను సీజ్ చేసి విశ్లేషించగా కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా దావులూరి ఆనంద్ మొబైల్ గ్యాలరీలో కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే రూ.16,23,000 మేర లంచాలు వసూలు చేసినట్లు రాసిపెట్టుకున్న చేతిరాత చిట్టాలతో పాటు, మొత్తం రూ.44,28,625 అక్రమ లావాదేవీల డిజిటల్ ఆధారాలు లభ్యం కాగా, రామనరసింహారావుకు సంబంధించి మరో రూ.74,000 లావాదేవీలు బయటపడ్డాయి. ఈ అవినీతి సంపాదనతో దావులూరి ఆనంద్ ఏకంగా హనుమకొండ నక్కలగుట్టలోని కపిల్ కాకతీయ టవర్స్ లో తన కుటుంబ సభ్యుల పేరిట సుమారు రూ.7.2 కోట్ల విలువైన రెండు వాణిజ్య సముదాయాలను కొనుగోలు చేసినట్లు అధికారులు పక్కా ఆధారాలతో గుర్తించారు. తమ అధికార దుర్వినియోగానికి పాల్పడి వ్యవస్థీకృతంగా లంచాలు మేసిన ఈ ఇద్దరు అవినీతి అధికారులను ఏప్రిల్ 20 వ తేదీన అరెస్టు చేసి, వరంగల్ లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు దర్యాప్తు సంస్థ అధికారికంగా వెల్లడించింది.








