Mahaa Daily Exclusive

  హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు….

Share

* ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు.
*సత్యమే జయించింది.. ధర్మమే నిలబడింది.
* మాజీ మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటన.
*చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్.
హైదరాబాద్, మహా.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న ఘోష్ కమిషన్ విషయంలో గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుకు గట్టి చెంపపెట్టు అని ఆయన అభివర్ణించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గత కొంతకాలంగా చేస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలు న్యాయస్థానం సాక్షిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. ‘సత్యమేవ జయతే’ అని నినదిస్తూ, ఎన్ని కుట్రలు పన్నినా అంతిమంగా ధర్మమే జయిస్తుందని ఈ రోజు మరోసారి నిరూపితమైందని ఆయన స్పష్టం చేశారు.
ప్రాథమిక హక్కులను, సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి, ఏకపక్షంగా సాగించిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టడం చారిత్రాత్మకమని హరీశ్ రావు కొనియాడారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని కోర్టు స్పష్టం చేయడం ద్వారా రేవంత్ రెడ్డి అసలు స్వరూపం బయటపడిందని విమర్శించారు. కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టులోని వందకు పైగా కాంపోనెంట్లలో కేవలం రెండు పిల్లర్లు కుంగితే, లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ కాంగ్రెస్ చేసిన గోబెల్స్ ప్రచారం ఈ తీర్పుతో అభాసుపాలైందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలు, దుష్ప్రచారాలు మానుకోవాలని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
మేడిగడ్డ వద్ద కుంగిన రెండు పిల్లర్ల విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీనతపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల విలువైన కాలాన్ని కేవలం రాజకీయ డ్రామాల కోసం వృథా చేశారని, తక్షణమే ఆ పిల్లర్లకు మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కేవలం వంద, రెండు వందల కోట్లు ఖర్చు చేస్తే మరో రెండు మూడు లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నా, ప్రభుత్వం కుట్రపూరితంగా ల్యాండ్ అక్విజిషన్ నిధులను ఆపివేసిందని ఆరోపించారు. మోటార్లు, రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్నా, రైతులకు అన్యాయం చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ‘ప్రాణేశ్వరం’ అని, ఇది 37 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ సహా 70 శాతం రాష్ట్రానికి తాగునీరు అందించే అద్భుత కట్టడమని ఆయన పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, వరి ధాన్యంలో ఐదు కిలోల తరుగు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నా మంత్రులు పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు. మొక్కజొన్న, సెనగలు, పొద్దుతిరుగుడు పంటలను కొనే దిక్కులేక రైతులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాలేదని, రైతు భరోసా ఊసే లేదని, విద్యుత్ కోతలతో రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు, విద్యా సంస్థలు రోడ్డున పడ్డాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పర్ఫార్మెన్స్ మీద రాజకీయాలు చేయాలే తప్ప, అక్రమ కేసులతో ప్రతిపక్షాలను లొంగదీసుకోవాలని చూస్తే భయపడేది లేదని, కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన ఉద్యమకారులమని ఆయన హెచ్చరించారు.
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, క్యాబినెట్ ఆమోదంతో జీవో ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారని, కొత్తవేమీ కోరడం లేదని ఆయన వివరించారు. మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీకి చెల్లించాల్సిన మూడు వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఎందుకు ఆపేసిందని ప్రశ్నించారు. బడ్జెట్‌లో నిధులు చూపిస్తున్నా విడుదల చేయకపోవడంతో కార్మికులకు డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని, తక్షణమే వారితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరును తప్పుబడుతూ, గోదావరి లింక్ ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారని, పొరుగు రాష్ట్రాలకు ప్యాకేజీలు వస్తుంటే తెలంగాణకు ఏమి సాధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కాలయాపన మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో పీఠం కదలడం ఖాయమని హరీశ్ రావు హెచ్చరించారు.