Mahaa Daily Exclusive

  కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి…

Share

* కిలో రూ. 4కే పడిపోయిన ధర.
* వికారాబాద్ మార్కెట్‌లో రైతుల ఆవేదన.
*పెట్టుబడి కూడా రాని పరిస్థితి.
* రోడ్డు పక్కన ఉల్లిని కుప్పలుగా పోసి నిరసన.

వికారాబాద్,మహా.

తెలంగాణలోని అన్నదాతను ‘ఉల్లి’ కష్టాలు వెంటాడుతున్నాయి. ఆకాశాన్నంటుతాయని భావించిన ఉల్లి ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడంతో రైతులు కుమిలిపోతున్నారు. వికారాబాద్ జిల్లాలోని మార్కెట్లలో ఉల్లి ధర కిలోకు కేవలం రూ. 4గా పలుకుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. నెలల తరబడి కష్టపడి, వేలల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంటకు కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మార్కెట్‌కు తీసుకువచ్చిన పంటను అమ్ముకోలేక, తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక ప్రైవేటు వ్యాపారులు అడిగిన కాడికి కట్టబెట్టాల్సిన దుస్థితి నెలకొందని వికారాబాద్ ప్రాంత ఉల్లి సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా మార్కెట్‌కు ఉల్లి రాక పెరగడం, మరోవైపు గ్రేడింగ్ పేరుతో వ్యాపారులు ధరను భారీగా తగ్గించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు, ఇప్పుడు వస్తున్న ధరతో కనీసం పది వేల రూపాయలు కూడా దక్కడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. వికారాబాద్ మార్కెట్ యార్డులో ధర చూసి నివ్వెరపోయిన రైతులు, తమ పంటను రోడ్ల పక్కనే కుప్పలుగా పోసి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధర ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏటా ధరల హెచ్చుతగ్గులతో నష్టపోతున్నామని, నిల్వ చేసుకునే సౌకర్యాలు (కోల్డ్ స్టోరేజీలు) లేకపోవడం వల్లనే తమకు ఈ దుస్థితి పడుతోందని వారు వాపోతున్నారు.