*మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
*తమిళనాట ఎన్డీయే కూటమిదే విజయం..
* డీఎంకే పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత.
* భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ ప్రజాస్వామికమని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ వారు ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్న ఒక గొప్ప నాయకుడిని, దేశ సార్వభౌమత్వం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధానిని ‘ఉగ్రవాది’ అని సంబోధించడం ఖర్గే అవివేకానికి, కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, ఖర్గే తక్షణమే దేశ ప్రజలకు, ప్రధానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొంతకాలంగా ఆ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటించినట్లు పొంగులేటి తెలిపారు. అక్కడ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ప్రధాని మోదీ నాయకత్వం పట్ల తమిళ ప్రజల్లో అపారమైన విశ్వాసం వ్యక్తమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఎడప్పాడి పళనిస్వామి సారథ్యంలో ఎన్డీయే కూటమి తమిళనాట అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని, ద్రవిడ మున్నేట్ర కజగం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు ఈ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడుతారని ఆయన ఉద్ఘాటించారు. కేవలం భాష, ప్రాంతీయ సెంటిమెంట్లను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న స్టాలిన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ‘ద్రావిడియన్ మోడల్’ పాలనలో అరాచకాలు, అక్రమాలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు. తిరువణ్ణామలై వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో జరిగిన అఘాయిత్యాలను ప్రస్తావిస్తూ, సామాన్య ప్రజలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత కోల్పోయిందని ధ్వజమెత్తారు. కుటుంబ పాలనతో రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారని, అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టులను వాడుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను కూడా దారి మళ్లిస్తూ ప్రజలను వంచిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏళ్లు గడుస్తున్నా, ఆ గాయాలు నేటికీ మానిపోలేదని పొంగులేటి గుర్తు చేశారు. ఉగ్రవాద రహిత భారతదేశం కోసం ప్రధాని మోదీ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వల్లే నేడు దేశం సురక్షితంగా ఉందని కొనియాడారు. అటువంటి మహోన్నత నాయకుడిని ఉగ్రవాదితో పోల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదానికి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ, స్టాలిన్ వంటి నేతలు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. ప్రధానిని దూషించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం భ్రమ మాత్రమేనని, దేశ భక్తులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కాంగ్రెస్, డీఎంకే కూటమి కేవలం అధికార దాహంతో ఏర్పడిన అపవిత్ర కలయిక అని పొంగులేటి ఎద్దేవా చేశారు. గతంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ పార్టీలు, ఇప్పుడు కేవలం మోదీని అడ్డుకోవడమే లక్ష్యంగా జతకట్టాయని విమర్శించారు. వీరి మేనిఫెస్టోలు కేవలం అబద్ధాల పుట్టలని, అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ మేనిఫెస్టో ‘వికసిత భారత్’ సంకల్పంతో రూపొందించబడిందని, ప్రతి ఒక్క పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. దేశాభివృద్ధికి అడ్డుపడుతున్న శక్తులను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారు సరైన తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ వేదికలపై భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన ఘనత మోదీకే దక్కుతుందని పొంగులేటి కొనియాడారు. ఆర్థికంగా దేశాన్ని అగ్రపథంలో నిలబెడుతూ, ప్రపంచ దేశాలకు దిక్సూచిగా భారత్ మారుతోందని చెప్పారు. ఇటువంటి తరుణంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, నోటికొచ్చినట్లు మాట్లాడటం శోచనీయమన్నారు. ఖర్గే వంటి సీనియర్ నాయకులు తమ హోదాను మర్చిపోయి మాట్లాడటం వారి వ్యక్తిత్వానికే కాకుండా, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కూడా అవమానకరమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలు ఉండవచ్చు కానీ, అవి వ్యక్తిగత దూషణలుగా మారకూడదని హితవు పలికారు.
తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని పొంగులేటి విమర్శించారు. ఆరు గ్యారెంటీలను నమ్మి ఓటేసిన ప్రజలను రేవంత్ రెడ్డి సర్కారు వంచిస్తోందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆర్థిక సాయం వంటి పథకాలు నేటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాళేశ్వరం వంటి అంశాలపై కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.








