హైదరాబాద్, మహా : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నలభై రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో 32 డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె బాట పట్టారని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్ తెలిపారు. ఈ పోరాటం కేవలం జీతభత్యాల కోసమే కాకుండా, రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ నుండి కాపాడుకునే యత్నమని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ లాభాపేక్ష సంస్థ కాదని, సామాన్య ప్రజలకు, విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన సేవలను అందించే సామాజిక బాధ్యతగా ప్రభుత్వం దాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణలు అమలు వంటి హామీలు ఇంకా నెరవేరలేదని విమర్శించారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో రూట్లను ప్రైవేటీకరించడం, సంస్థ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించడం వల్ల భవిష్యత్తులో చార్జీలు పెరగడం, రాయితీలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని కార్మిక సంఘాలతో నేరుగా చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఆర్టీసీ బలోపేతం జరిగితేనే సామాన్య ప్రజల ప్రయాణం సురక్షితంగా ఉంటుందని, ఈ పోరాటంలో కార్మికులకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.








