Mahaa Daily Exclusive

  ఓటుకు నోటు కేసు…

Share

  • ఓటుకు నోటు కేసు
  • విచారణను 2 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • ఎన్నికల ఉల్లంఘన కేసుగా చూడాలన్న రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, మహా : 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం కేసు సుప్రీంకోర్టు ముందుకు రాగా.. విచారణను మరో 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని స్పెషల్ బెంచ్ వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా.. దానిపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి ఆధ్వర్యంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ ఓటుకు నోటు కేసును విచారణ చేపట్టింది. ఈ ప్రత్యేక బెంచ్‌లో జస్టిస్ విజయ్ బిష్ణోయ్ కూడా సభ్యులుగా ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కేసులో రెండు కీలక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కాగా.. మరొకటి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేశారు.

రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

ఇక ఓటుకు నోటు కేసులో పిటిషన్ దాఖలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దీన్ని అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల ప్రకారమే విచారణ చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసును అవినీతి క్రిమినల్ కేసుగా కాకుండా.. ఎన్నికల ఉల్లంఘన కేసుగా పరిగణించాలని రేవంత్ రెడ్డి వాదించారు.

సండ్ర వెంకట వీరయ్య పిటిషన్

ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. ఈ కేసు నుంచి తన పేరును పూర్తిగా తొలగించాలని సుప్రీంకోర్టును కోరారు. తనపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను కలిపి విచారణ చేయాలని సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయించింది. దీంతో ఈ కేసు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడినప్పటికీ, ఈ కేసు ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. వచ్చే విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, నైతిక విలువలపై ఈ కేసు కీలకంగా నిలుస్తోంది.