Mahaa Daily Exclusive

  యువతే లక్ష్యంగా ప్రగతి ప్రణాళిక….

Share

* మే 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్రీడోత్సవాలు.
* ప్రజల వద్దకే పాలన.. సమస్యల పరిష్కారమే ధ్యేయం.
* మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి.

హైదరాబాద్, మహా.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా యువతరం ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ భారీస్థాయిలో క్రీడా, యువజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వచ్చే నెల 18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి ప్రకటించారు. బుధవారం ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో క్రీడల శాఖ రూపొందించిన ‘యువజన క్రీడోత్సవాల’ ప్రత్యేక పోస్టర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల ముంగిటకే చేర్చడమే ప్రజా పాలన ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నారని వారు పేర్కొన్నారు.
యువతకు ఉపాధి కల్పనతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు. మే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ స్థాయిలో ఉద్యోగ మేళాలను నిర్వహించనున్నట్లు మంత్రులు వెల్లడించారు. అనంతరం మే 18 నుంచి వరుసగా వారం రోజుల పాటు యువతను చైతన్య పరిచేలా విభిన్న కార్యక్రమాలు సాగనున్నాయి. మే 18న రాష్ట్రవ్యాప్తంగా మారథాన్ రన్, ఫిజికల్ లిటరసీ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 19న కెరీర్, స్కిల్ డెవలప్‌మెంట్ డే నిర్వహించి విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారు. మే 20న యూత్ లీడర్‌షిప్ సమ్మిట్స్, 21న రాష్ట్రవ్యాప్త క్రీడా దినోత్సవం, 22న ‘యువత్ ఫర్ క్లీన్ తెలంగాణ – సర్వ్ అండ్ సపోర్ట్’ పేరిట సేవా కార్యక్రమాలు చేపడతారు. చివరి రోజు మే 23న ఉద్యోగ సాధన కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ కార్యక్రమాల్లో యువత, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనేలా జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు ఆదేశించారు.
క్రీడల పట్ల రాష్ట్రంలో అపూర్వ స్పందన లభిస్తోందని స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనిబాలా దేవి ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవల గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన సీఎం కప్ 2025 రెండో ఎడిషన్‌లో సుమారు 5.64 లక్షల మంది క్రీడాకారులు ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషమని ఆమె పేర్కొన్నారు. రానున్న క్రీడోత్సవాల్లో 16 ఏళ్లు పైబడిన యువతను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, యువజన సర్వీసుల జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్, స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవితేజ, టాస్క్ సీఈఓ నితిన్ రెడ్డి, డిఐడి అధికారి రాజేశ్వర్ రెడ్డి, స్పోర్ట్స్ పి.ఆర్.ఓ సురేష్ కాలేరు తదితరులు పాల్గొన్నారు.