* కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.
*దేశ సేవలోకి మరో 46 మంది అసిస్టెంట్ కమాండెంట్లు.
* ఘనంగా 56వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.
* శౌర్య స్థల్ వద్ద వీర జవాన్లకు నివాళి..
హైదరాబాద్, మహా.
దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఒక పటిష్టమైన కవచంలా నిలుస్తోందని, కొత్తగా విధుల్లోకి చేరుతున్న యువ అధికారులతో ఈ దళం మరింత బలోపేతం అవుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం సీఆర్‌పీఎఫ్ అకాడమీలో 56వ బ్యాచ్ ‘డైరెక్ట్లీ అపాయింటెడ్ గెజిటెడ్ ఆఫీసర్స్’ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అకాడమీలోని ‘శౌర్య స్థల్’ వద్ద దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పరేడ్‌ను పర్యవేక్షించి, శిక్షణ పూర్తి చేసుకున్న యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 46 మంది యువ అసిస్టెంట్ కమాండెంట్లు ఈ వేడుక ద్వారా అధికారికంగా విధుల్లోకి చేరారు. క్రమశిక్షణ, ధైర్యం, అంకితభావంతో మాతృభూమిని రక్షిస్తామని యువ అధికారులు ప్రమాణం చేయడం గర్వకారణమని బండి సంజయ్ పేర్కొన్నారు. శిక్షణ కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ఆయన ప్రత్యేక పురస్కారాలను అందజేసి అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో భారత భద్రతా దళాలు సరికొత్త శక్తిని, ఆధునిక దృక్పథాన్ని సంతరించుకుంటున్నాయని, దేశ రక్షణలో జాతీయ గర్వాన్ని చాటిచెబుతున్నాయని ఆయన కొనియాడారు.
దేశం మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అత్యంత గర్వంగా, గౌరవంగా భారత్ సేవలో భాగస్వాములు కావాలని కొత్తగా బాధ్యతలు చేపడుతున్న అధికారులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. సాహసం, విధేయతలే ఆయుధాలుగా మాతృభూమి రక్షణలో ప్రతి ఒక్కరూ ధ్రువతారల్లా మెరవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు, శిక్షణ పూర్తి చేసుకున్న అధికారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








