Mahaa Daily Exclusive

  వానకాలం నాటికే ‘సీతారామ’ ఫలాలు…మంత్రి తుమ్మల కీలక ఆదేశం.

Share

*సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలి.
* మే నాటికి పెండింగ్ పనులు పూర్తి.

హైదరాబాద్ , మహా.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను అందించే మహత్తర లక్ష్యంతో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, తొట్టి పంప్ హౌస్ నుంచి యట్లకుంట వరకు సుదీర్ఘ పర్యటన చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు అంకిత్, అనుదీప్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. 43 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ కాలువ ద్వారా సుమారు 1.46 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని, మొత్తం 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంలో ఇప్పటికే 600 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యానికి తావులేకుండా, వానకాలం ప్రారంభమయ్యే నాటికే ఆయకట్టుకు నీరు చేరాలని అధికారులకు స్పష్టం చేశారు.
పనుల గడువుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, యట్లకుంట టెర్మినల్ వద్ద పెండింగ్‌లో ఉన్న 30 మీటర్ల పనులను 15 రోజుల్లోగా ముగించాలని, గోదావరి వరదలు రాకముందే 5 నుంచి 10 వరకు ఉన్న స్ట్రక్చర్ పనులను పూర్తి చేయాలని సూచించారు. మే చివరి నాటికి అన్ని నిర్మాణ పనులను, వర్షాకాలం లోపు టన్నెల్ పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి నిధులన్నీ విడుదల చేశామని, ఏవైనా న్యాయపరమైన చిక్కులు లేదా స్థానిక వివాదాలు ఉంటే వెంటనే కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. చిన్నపాటి భూ వివాదాలు ఇంతటి భారీ ప్రాజెక్టుకు ఆటంకం కాకూడదని హితవు పలికారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మధ్య సమన్వయం అవసరమని, ఇరిగేషన్, ఫారెస్ట్, పోలీస్ శాఖలు కలిసి పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యట్లకుంట టన్నెల్ పనులు జాప్యం అయ్యాయని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దీనిని పూర్తి చేయడం గర్వకారణమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇప్పటికే రాజీవ్ కెనాల్ స్థిరీకరణ ద్వారా 1.35 లక్షల ఎకరాలకు నీరందించామని, రానున్న రోజుల్లో వైరా ఆయకట్టుతో పాటు తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాలకు గోదావరి నీటిని మళ్లిస్తామని వెల్లడించారు. సత్తుపల్లి కాలువ ద్వారా వేంసూరు, దమ్మపేట మండలాలకు లబ్ధి చేకూరుతుందని, నాలుగో పంప్ హౌస్ పూర్తయితే అశ్వారావుపేట వరకు నీరు చేరుతుందన్నారు. తద్వారా 110 కిలోమీటర్ల కాలువ నెట్‌వర్క్ పూర్తయి, 8 నియోజకవర్గాల్లోని భూములు సస్యశ్యామలం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేసి పాలేరు ప్రాంతానికి, మారెళ్లపాడు లిఫ్ట్ ద్వారా పినపాకలోని 16,500 ఎకరాలకు నీరందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పునరుద్ఘాటించారు.