*పుట్టినరోజు, పెళ్లి రోజున స్పెషల్ లీవ్.
* విధి నిర్వహణలో ఒత్తిడి తగ్గించేలా అడుగులు.
* రిటైర్మెంట్‌కు ముందు సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి ‘వార్షిక’ కానుక.
* రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు.. 30న పదవీ విరమణ చేయనున్న డీజీపీ.
హైదరాబాద్, మహా.
నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమై, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించే తెలంగాణ పోలీసులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి తీపి కబురు అందించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వారి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే దిశగా ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలోని ప్రతి పోలీస్ ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ‘ప్రత్యేక సెలవు’ మంజూరు చేస్తూ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. హోదాతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ సౌకర్యం వర్తించనుంది.
శాంతిభద్రతల పరిరక్షణ, వీఐపీల బందోబస్తు, నేర నియంత్రణ వంటి విధుల్లో పోలీసులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారని, ఈ క్రమంలో వారు తమ కుటుంబ సభ్యులతో సమయం గడపలేకపోతున్నారన్న వాస్తవాన్ని డీజీపీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులను కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారని, దీనివల్ల వారిలో పని పట్ల ఉత్సాహం పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు అన్ని యూనిట్ అధికారులకు (ఎస్పీలు, కమిషనర్లు) స్పష్టమైన ఆదేశాలు అందాయి. అత్యవసర పరిస్థితులు మినహా, సిబ్బంది ఈ ప్రత్యేక సందర్భాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా సెలవు మంజూరు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం కూడా ఉంది. డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న (ఏప్రిల్ 30, 2026) పదవీ విరమణ చేయనున్నారు. తన పదవీకాలం ముగిసేలోగా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఏదైనా శాశ్వత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈ ‘వార్షిక కానుక’ను ప్రకటించినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలో ఇలాంటి విధానం అమల్లో ఉండగా, ఇప్పుడు తెలంగాణలో కూడా దీనికి శ్రీకారం చుట్టడంపై పోలీసు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం డ్యూటీల ఒత్తిడిలో ఉండే మాకు ఇది నిజంగా ఒక గొప్ప ఊరట అని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.
జనవరిలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డీజీపీ శివధర్ రెడ్డి సాంకేతికత వినియోగం మరియు పోలీసు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో పోలీస్ వెల్ఫేర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు స్టాఫ్ క్వార్టర్స్‌ను ప్రారంభించిన ఆయన, ఇప్పుడు ఈ సెలవుల నిర్ణయం ద్వారా సిబ్బంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం కంటే ముందుగానే సిబ్బంది తమ యూనిట్ అధికారులకు లిఖితపూర్వక అభ్యర్థన సమర్పించాల్సి ఉంటుందని, సర్వీస్ రిజిస్టర్‌లోని వివరాల ఆధారంగా ఈ సెలవును కేటాయిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.








