Mahaa Daily Exclusive

  31మందికి టికెట్లు కట్….

Share

  • 31మందికి టికెట్లు కట్
  • ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జిలపై కేసీఆర్ ఆగ్రహం
  • సిట్టింగ్ లయినా.. సీటు గ్యారంటీ కాదు
  • సోషల్‌ మీడియాలో కాదు.. ఫీల్డ్‌లో యాక్టివ్‌గా ఉండాలి
  • నేను ఒకసారి చెబితే.. వెయ్యిసార్లు చెప్పినట్లే
  • జిల్లాకమిటీలు, అనుబంధసంఘాలు అన్నీ రద్దు
  • 60లక్షలమంది మెంబర్స్ ఉంటే ఎందుకు ఓడినం
  • ఢిల్లీలో వెధవలు రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు

హైదరాబాద్, మహా

సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా పార్టీ ఆదేశాలు పాటించకుంటే టికెట్ కట్ చేస్తానని గులాబీదళపతి కేసీఆర్ హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలపై, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన మినీప్లీనరీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి ఇంకా బీఎల్‌ఓ జాబితాను బీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాల నుంచి జాబితా రాలేదని, సభ్యత్వ నమోదులో చురుగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సిట్టింగ్ లని కూడా చూడనని, టికెట్లు ఇవ్వనని తేల్చిచెప్పారు. ‘15రోజుల్లో బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి. టికెట్‌ కేటాయింపులకు సభ్యత్వ నమోదు ప్రామాణికం. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా కాదు.. ఫీల్డ్‌లో యాక్టివ్‌గా ఉండాలి. సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సీరియస్‌ యాక్షన్‌ ఉంటుంది,. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అని కూడా చూడను.. టికెట్‌ ఇవ్వను. నేను ఒకసారి చెబితే.. వెయ్యి సార్లు చెప్పినట్లే’ అని హెచ్చరించారు. సభ్యత్వం సరైనోళ్థకు ఇవ్వాలని, రాశి కంటే వాసికి ప్రాధాన్యమివ్వాలన్నారు. 60లక్షలమంది సభ్యత్వం ఉంటే ఎందుకు ఓడామని, అందరూ క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు.

ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు

ఢిల్లీ వీధుల్లో తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పడుతోందని, పార్లమెంట్‌లో మన గొంతు లేకపోవడం వల్లే ‘వెధవలు’ కూడా రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై నోరు మెదపని రాష్ట్ర ఎంపీల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ, తెలంగాణ పౌరుషం కేవలం బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ఉద్ఘాటించారు. భారత్-పాకిస్థాన్ విభజనతో తెలంగాణ ఏర్పాటును పోల్చిన ఆ ఎంపీని ‘పెద్ద వెధవ’గా అభివర్ణిస్తూ, అప్పుడు సభలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా 16 మంది ఎంపీలు మౌనంగా ఉండటం రాష్ట్రానికే సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ పౌరుషం లేని వారు ఎంపీలుగా ఉంటే రాష్ట్ర ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గనుక బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించి, ఆ ఎంపీతో క్షమాపణ చెప్పించేవారమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కోసం తాను అనుభవించిన మానసిక క్షోభను, కొట్లాడి సాధించిన విజయాలను ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

బొందలగడ్డగా తెలంగాణ

ఒకప్పుడు అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, నేడు ‘బొందలగడ్డ’గా మారుతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల భాషను చూస్తుంటే జాలి వేస్తోందని, ప్రజల సమస్యలను పరిష్కరించడం చేతకాక చిల్లర కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు చేయలేని చేతకానితనంతో రైతులను గోస పెడుతున్నారని, గడిచిన పదేళ్లలో రైతును రాజును చేస్తే, నేడు మళ్లీ రోడ్డున పడేస్తున్నారని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉపనేతలు హరీష్ రావు, తలసాని, సబిత, మధుసూధనాచారి, ప్రధానకార్యదర్శి జీవన్ రెడ్డి సహా కీలకనేతలంతా ప్లీనరీలో పాల్గొన్నారు.
…….