డిజిటల్ ఇండియాలో కేరళ నంబర్ వన్.
* 15–49 ఏళ్ల పురుషుల్లో 94.9%తో కేరళకు అగ్రస్థానం.
* 87.3%తో తెలంగాణకు కీలక స్థానం
హైదరాబాద్, మహా.
దేశంలో డిజిటల్ విప్లవం ఏ స్థాయిలో విస్తరించిందో తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 15–49 ఏళ్ల వయసున్న పురుషుల్లో ఇంటర్నెట్ వినియోగం విషయంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో ఏకంగా 94.9 శాతం మంది పురుషులు ఇప్పటివరకు ఇంటర్నెట్‌ను ఉపయోగించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 93.2 శాతంతో రెండో స్థానంలో ఉండగా.. నాగాలాండ్ 90.5 శాతం, గోవా 90.9 శాతం, సిక్కిం 89.4 శాతంతో తదుపరి స్థానాల్లో నిలిచాయి.
తెలంగాణ కూడా డిజిటల్ వినియోగంలో దేశంలో ముందువరుసలో నిలిచింది. రాష్ట్రంలో 87.3 శాతం మంది 15–49 ఏళ్ల వయసున్న పురుషులు ఇప్పటివరకు ఇంటర్నెట్‌ను వినియోగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పంజాబ్‌లోనూ ఇదే స్థాయిలో 87.3 శాతం నమోదైంది. హర్యానా 87 శాతం, ఉత్తరాఖండ్ 86.7 శాతం, కర్ణాటక 84.3 శాతం, ఆంధ్రప్రదేశ్ 83.7 శాతం, గుజరాత్ 83.9 శాతం, మహారాష్ట్ర 82.6 శాతంగా ఉన్నాయి.
దక్షిణాదిలోనూ తెలంగాణకు ప్రత్యేక స్థానం
దక్షిణాది రాష్ట్రాలను పరిశీలిస్తే కేరళ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. తెలంగాణ 87.3 శాతంతో రెండో స్థానానికి చేరువలో ఉండగా, కర్ణాటక 84.3 శాతం, ఆంధ్రప్రదేశ్ 83.7 శాతం, తమిళనాడు 81.6 శాతంతో కొనసాగుతున్నాయి. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో డిజిటల్ కనెక్టివిటీ విస్తరణ గణనీయంగా ఉన్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఈశాన్యంలో నాగాలాండ్ హవా
ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్ 90.5 శాతంతో అగ్రస్థానంలో ఉంది. సిక్కిం 89.4 శాతం, మిజోరం 88.1 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో 80 శాతం, త్రిపురలో 71.9 శాతం, అస్సాంలో 70.4 శాతం, మేఘాలయలో 68.7 శాతం మంది పురుషులు ఇంటర్నెట్‌ను ఉపయోగించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మణిపూర్‌కు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.
కొన్ని రాష్ట్రాల్లో 80 శాతానికి మించి
ఇంటర్నెట్ వినియోగంలో ఉత్తర భారత రాష్ట్రాలు కూడా గణనీయమైన పురోగతి సాధించాయి. హర్యానా 87 శాతం, పంజాబ్ 87.3 శాతం, ఉత్తరాఖండ్ 86.7 శాతం, హిమాచల్‌ప్రదేశ్ 83 శాతం, ఉత్తరప్రదేశ్ 81 శాతం, జమ్మూకశ్మీర్ 80.8 శాతం, రాజస్థాన్ 80.5 శాతంగా నమోదయ్యాయి. బిహార్‌లో 78.1 శాతం మంది పురుషులు ఇంటర్నెట్‌ను ఉపయోగించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా ఉంది. దాద్రా-నగర్ హవేలీ, దమన్-దీవ్ 91.7 శాతం, లక్షద్వీప్ 91.4 శాతం, గోవా 90.9 శాతం, అండమాన్-నికోబార్ దీవులు 86.1 శాతంతో ముందంజలో ఉన్నాయి.
డిజిటల్ కనెక్టివిటీకి అద్దం
స్మార్ట్‌ఫోన్లు, చౌకైన డేటా సేవలు, డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ విద్య, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా 15–49 ఏళ్ల వయసు ఉద్యోగ, విద్య, వ్యాపార కార్యకలాపాల్లో చురుకుగా ఉండే వర్గం కావడంతో ఈ గణాంకాలకు ప్రాధాన్యం ఉంది.
కేరళ 94.9 శాతంతో దేశంలో టాప్‌లో నిలవగా.. తెలంగాణ 87.3 శాతంతో దేశంలోని అధిక ఇంటర్నెట్ వినియోగం ఉన్న రాష్ట్రాల సరసన నిలవడం విశేషం. రాష్ట్రంలో డిజిటల్ సేవల వినియోగం, ఆన్‌లైన్ లావాదేవీలు, ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్య తదితర రంగాలకు ఇది మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది.







