Mahaa Daily Exclusive

  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే అసలైన పండుగ…

Share

*పరేడ్ గ్రౌండ్స్ వేదికగా రాజకీయ మార్పు.
*బీజేపీకి పెరిగిన ప్రజాధారణ.
* కాంగ్రెస్, బీఆర్ఎస్ దుకాణాలు మూతపడటం ఖాయం.
*బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్ర రావు.
హైదరాబాద్‌, మహా.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే కార్యకర్తలందరికీ అసలైన పండుగని ఆ పార్టీ రాష్ట్ర నేత ఎన్. రాంచందర్ రావు ఉద్ఘాటించారు.
సోమవారం తన జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే, ఈ ఉత్సాహం కేవలం వేడుకలకే పరిమితం కాకూడదని, రాబోయే రోజుల్లో పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టే వరకు ఇదే పట్టుదలతో పని చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే గుణం ఒక్క ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే ఉందని, ప్రస్తుతం కొందరు నాయకులు అసెంబ్లీకో, పార్టీ ఆఫీసుకో వస్తేనే వార్తగా మారుతున్న విచిత్ర రాజకీయాలను రాష్ట్రంలో చూస్తున్నామని విమర్శించారు.
త్వరలో హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేయబోతోందని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రసంగించబోయే ఈ సభను విజయవంతం చేసేందుకు గ్రామ గ్రామం నుండి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీల ప్రాభవం పూర్తిగా తగ్గిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ చాలా బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ వంటి కీలక కార్పొరేషన్లపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ లక్ష్య సాధన కోసం మహిళా మోర్చా, యువ మోర్చా సహా అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని కోరారు. పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమించాలని సూచించారు. తన పుట్టినరోజు సందర్భంగా విమానాశ్రయం నుండి పార్టీ కార్యాలయం వరకు కార్యకర్తలు చూపిన అభిమానం మరువలేనిదని, ఈ స్ఫూర్తితోనే పార్టీని మరింత బలోపేతం చేద్దామని రాంచందర్ రావు పేర్కొన్నారు.