- టెక్కీల ఆశలపై అమెరికా నీళ్ళు
- హెచ్-1బీ వీసాలకు భారీ కోత
- అమెరికా కొత్త బిల్లుతో భారీగా తగ్గింపు
న్యూయార్క్, మహా : అమెరికాలో స్థిరపడాలని, అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలని కలలు కనే భారతీయ యువతకు గడ్డుకాలం మొదలైనట్లు కనిపిస్తోంది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపీల బృందం ఒక సంచలన బిల్లును అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. ‘ఎండ్ హెచ్-1బీ వీసా అబ్యూస్ యాక్ట్-2026’ పేరుతో తెచ్చిన ఈ ప్రతిపాదనలు చట్టంగా మారితే, భారత్ నుంచి వెళ్లే నిపుణుల సంఖ్య నామమాత్రంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
65 వేల నుంచి 25 వేలకు కోత
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఏడాదికి సుమారు 65,000 కొత్త హెచ్-1బీ వీసాలను జారీ చేస్తోంది. తాజా బిల్లు ప్రకారం, ఈ కోటాను ఏకంగా 25 వేలకు తగ్గించాలని రిపబ్లికన్లు పట్టుబడుతున్నారు. దీనివల్ల కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగి, వీసా దక్కడం లాటరీ కంటే కష్టతరం కానుంది. అమెరికాలోని భారీ కార్పొరేట్ కంపెనీలు తక్కువ వేతనాల కోసం విదేశీయులను నియమించుకుంటూ, స్థానిక అమెరికన్ల అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ఈ బిల్లును ప్రవేశపెట్టిన అరిజోనా ప్రతినిధి ఎలీ క్రేన్ వాదించారు.
జీతం రూ. 1.7 కోట్లు ఉంటేనే వీసా
ఈ బిల్లులో అత్యంత కీలకమైన నిబంధన కనీస వేతనం. హెచ్-1బీ వీసా పొందాలంటే సదరు ఉద్యోగికి ఏడాదికి కనీసం 2,00,000 డాలర్లు (సుమారు రూ. 1.7 కోట్లు) జీతం చెల్లించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. సాధారణంగా ఎంట్రీ లెవల్ లేదా మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇంత భారీ వేతనం ఇవ్వడం కంపెనీలకు భారంగా మారుతుంది. తక్కువ జీతాలకు పనిచేసే విదేశీయుల కాలం చెల్లిందని, కేవలం అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే అమెరికాలో చోటు ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు. భారతీయులను ఆందోళనకు గురిచేసే మరిన్ని అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి: వీసా పొందిన వారు తమ జీవిత భాగస్వామిని లేదా పిల్లలను వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. హెచ్-1బీ నుంచి గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం) పొందే ప్రక్రియను ఈ బిల్లు అడ్డుకుంటుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం చేసుకునే ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’ (ఓపీటీ) వెసులుబాటును కూడా తొలగించాలని కోరుతున్నారు.
భారతీయ ఐటీ రంగానికి పెను సవాల్
భారతీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు తమ ప్రాజెక్టుల కోసం భారీగా హెచ్-1బీ సిబ్బందిపై ఆధారపడతాయి. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే, భారతీయ కంపెనీల వ్యయం భారీగా పెరుగుతుంది. మరోవైపు, ట్రంప్ గతంలో ప్రతిపాదించిన 1,00,000 డాలర్ల అదనపు రుసుము భారంతో ఇప్పటికే సతమతమవుతున్న ఇన్వెస్టర్లకు, ఈ కొత్త బిల్లు మరింత గుబులు కలిగిస్తోంది. కేవలం చట్టసభల్లోనే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ అమెరికా ప్రభుత్వం నిఘా పెంచుతోంది. 2025 సెప్టెంబర్ 19న అమెరికా కార్మిక శాఖ ‘ప్రాజెక్ట్ ఫైర్ వాల్’ను ప్రారంభించింది. కంపెనీలు తమ స్వార్థం కోసం వీసా నిబంధనలను అతిక్రమిస్తున్నాయా లేదా అని తనిఖీ చేయడమే దీని పని. “అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులు తక్కువ వేతనానికి తన్నుకుపోకుండా చూడటమే మా లక్ష్యం” అని ప్రతినిధి బ్రాండన్ గిల్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇది ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, అమెరికాలో పెరుగుతున్న ఈ ‘స్థానిక’ నినాదం గ్లోబల్ టెక్ మార్కెట్‌ను కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది.








