*దేశవ్యాప్తంగా 30 వేల పోస్టుల రద్దుకు రంగం సిద్ధం.
*ఏప్రిల్ 1 నాటికి మంజూరైన పోస్టుల్లో కోత అమలు.
* అన్ని జోన్ల జీఎంలకు రైల్వే శాఖ ఆదేశాలు.
* క్లరికల్, మెయింటెనెన్స్ విభాగాలపైనే ప్రధాన ప్రభావం.
హైదరాబాద్, మహా.
ప్రైవేటు కంపెనీలకే పరిమితమైన ఉద్యోగాల కోత మహమ్మారి ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలనూ కమ్మేస్తోంది. వ్యయ నియంత్రణ పేరుతో దేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ రైల్వే భారీ స్థాయిలో కొలువుల కోతకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా ఏకంగా 30 వేల పోస్టులను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
**జీఎంలకు ఆదేశాలు జారీ..**
2026 ఏప్రిల్ 1 నాటికి మంజూరైన పోస్టుల ఆధారంగా ఈ కోతలను కచ్చితంగా అమలు చేయాలని రైల్వే బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లకు (జీఎం) సర్క్యులర్లు అందాయి. రద్దు చేస్తున్న జాబితాలో కేవలం దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న పోస్టులే కాకుండా, ప్రస్తుతం ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్న పోస్టులు కూడా ఉండటం గమనార్హం. అయితే, పోస్టుల రద్దుతో ప్రభావితమయ్యే ఉద్యోగులను విధుల నుంచి తొలగించకుండా ఇతర ప్రాంతాలు లేదా అవసరమున్న ఇతర విభాగాల్లో సర్దుబాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
**క్లరికల్, నిర్వహణ విభాగాలపైనే గురి**
తాజా కోతల్లో ప్రధానంగా క్లరికల్, మెయింటెనెన్స్ (నిర్వహణ) విభాగాలకు చెందిన పోస్టులకే ఎసరు వచ్చింది. రైల్వేలో అంతకంతకూ పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయాన్ని గత ఏడాది రైల్వే శాఖ తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా 2 శాతం చొప్పున పోస్టులను క్రమంగా రద్దు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ఆధునికీకరణ, సాంకేతికత వినియోగం పెరుగుతున్న కొద్దీ మానవ వనరుల అవసరం తగ్గుతోందని భావిస్తున్న రైల్వే.. అందుకు అనుగుణంగానే ఈ ప్రక్షాళనకు దిగింది.
**ఏపీలో 2 వేల పోస్టులకు ఎసరు!**
రైల్వే శాఖ తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌పైనా తీవ్ర ప్రభావం పడనుంది. రాష్ట్రం ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే , తూర్పు కోస్తా రైల్వే ,పరిధిలోకి వస్తుంది. ఈ రెండు జోన్ల పరిధిలో కలిపి రాష్ట్రంలో సుమారు రెండు వేల పోస్టులు రద్దయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయంతో రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.







