*ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకవర్గాల రద్దు దారుణం.
*హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తారా?
*ఎన్నికలు నిర్వహించండి.. లేదా పాత పాలకవర్గాలనే కొనసాగించండి.
*రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన టీఎస్కాబ్ మాజీ చైర్మన్ రవీందర్ రావు.
* సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సహకార సంఘాల ప్రతినిధుల మీడియా సమావేశం.
హైదరాబాద్, మహా.
సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సహకార రంగ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకవర్గాలను రద్దు చేసి, వారి స్థానంలో నామినేటెడ్ విధానాన్ని తీసుకురావాలన్న సర్కారు నిర్ణయాన్ని వారు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల ప్రతినిధులు ప్రత్యేక మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ (టీఎస్కాబ్) మాజీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన 597 జీవో ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని, సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని మండిపడ్డారు.
ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 330 సహకార సంఘాలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయని రవీందర్ రావు వెల్లడించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు.. గత పాలక వర్గాలనే తిరిగి కొనసాగించాలని అత్యంత స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. అయితే, న్యాయస్థానం తీర్పు వెలువడి నాలుగు నెలలు గడుస్తున్నా.. దానిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎక్కడైనా అవకతవకలు, అక్రమాలు జరిగిన చోట మాత్రమే ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంటుందని, కానీ ఏకంగా మొత్తం సహకార వ్యవస్థనే రద్దు చేసి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టాలని చూడటం శోచనీయమన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది సభ్యులతో ఏకంగా 60 వేల కోట్ల రూపాయల భారీ టర్నోవర్‌తో సహకార వ్యవస్థ నడుస్తోందని, ఇందులో రాజకీయ ప్రమేయం చాలా తక్కువగా ఉండి ప్రధానంగా రైతులే సభ్యులుగా ఉన్నారన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.
సహకార సంఘాల పట్ల గత పాలకుల స్ఫూర్తిని కొనసాగించాలని ఈ సందర్భంగా ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రొఫెషనల్ బ్యాంకర్లకు సహకార వ్యవస్థలో పెద్దపీట వేశారని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని వారు గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే తరహాలో సహకార వ్యవస్థకు స్వతంత్రత కల్పించాలని కోరారు. సహకార సంఘాల వ్యవహారాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్నారు.
ఒకవైపు రైతులు ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, వారికి అండగా నిలవాల్సిన సంఘ సభ్యులను పక్కనపెట్టడం తగదన్నారు. తక్షణమే సహకార సంఘాలకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో అప్పటి వరకు పాత పాలక వర్గాలనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజల చేత ఎన్నుకోబడిన పాలక వర్గాలను అకారణంగా తొలగించి.. వెనుక దారిలో నామినేటెడ్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందని సహకార సంఘాల ప్రతినిధులు నిలదీశారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించి హైకోర్టు తీర్పును అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.







