Mahaa Daily Exclusive

  సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కోసమే.. సరఫరాదారుల కోసం కాదు!

Share

* వస్తువుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దు.
* కొనుగోళ్లన్నీ ‘సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్’ ద్వారానే జరగాలి.
* సరఫరా పర్యవేక్షణకు మండల స్థాయిలో నోడల్ అధికారులు.
* సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.
హైదరాబాద్, మహా.
సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే వస్తువులు, పథకాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. విద్యార్థుల వసతులు, కొనుగోళ్ల విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
**లబ్ధిదారుల ప్రయోజనాలే ముఖ్యం..**
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే సంక్షేమ పథకాలు కేవలం లబ్ధిదారుల కోసం మాత్రమేనని, వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్ల కోసం కాదని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ప్రతి అధికారి కచ్చితంగా గుర్తుంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు అత్యుత్తమ నాణ్యమైన వస్తువులను అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. విద్యార్థులకు పంపిణీ చేసే దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ తదితర వస్తువుల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, నాసిరకం వస్తువులు ఇస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
**కొనుగోళ్లలో పారదర్శకత..**
సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అవసరమైన వస్తువులన్నింటినీ ఇకపై ‘సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్’ (కేంద్రీకృత కొనుగోలు) విధానం ద్వారానే సేకరించి, విద్యార్థులకు నేరుగా అందేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా కొనుగోళ్లలో పారదర్శకత వస్తుందని స్పష్టం చేశారు.
**మండల స్థాయిలో నోడల్ అధికారులు..**
విద్యార్థులకు వస్తువుల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వస్తువుల పంపిణీ సజావుగా సాగేలా ఈ నోడల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.