- ఎంఎంటీఎస్ ఫేజ్ టూ విస్తరణ
- హైదరాబాద్ శివార్లలో మరో మూడు కొత్త రైల్వే స్టేషన్లు
- ప్రతిపాదించిన దక్షిణ మధ్య రైల్వే
- బోర్డు ఆమోదమే తరువాయి
హైదరాబాద్, మహా : పెరుగుతున్న హైదరాబాద్ నగర జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో భాగంగా ఎంఎంటీఎస్ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే కొత్తగా మూడు స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అల్వాల్ లయోలా కాలేజీ, ఆనంద్‌బాగ్, మౌలాలీ క్వార్టర్స్ సమీపంలో ఈ స్టేషన్లను నిర్మించేందుకు అవసరమైన సాధ్యాసాధ్యాల నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. ఘట్‌కేసర్ నుంచి సనత్‌నగర్ మధ్య ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్ల రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ మార్గంలో కొత్త స్టేషన్ల అవసరం పెరిగింది. వాస్తవానికి పదేళ్ల క్రితమే ఈ సెక్షన్‌లో ఆరు స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. అల్వాల్ లయోలా కాలేజీ వద్ద స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీనిపై స్పందించిన డివిజనల్ రైల్వే మేనేజర్ బృందం ఇటీవల సంబంధిత లెవల్ క్రాసింగ్‌ను సందర్శించి, స్టేషన్ నిర్మాణానికి ఉన్న సాంకేతిక అవకాశాలను పరిశీలించి నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపారు.
రైల్వే నిబంధనల ప్రకారం సబర్బన్ ప్రాంతాల్లో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఉండాలి. అయితే చర్లపల్లి నుంచి నేరేడ్‌మెట్ వరకు ప్రస్తుతం ఒక్క స్టేషన్ కూడా లేదు. దీనివల్ల మల్కాజిగిరి చుట్టుపక్కల నివసించే వేలాది మంది ప్రయాణికులు చర్లపల్లి లేదా నిజామాబాద్ మార్గంలో వెళ్లే రైళ్లను ఎక్కాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఆనంద్‌బాగ్‌లో కొత్త స్టేషన్ నిర్మిస్తే మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని కాలనీవాసులకు ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయి. మౌలాలీ రైల్వే క్వార్టర్స్ పరిసరాల్లో దాదాపు 2 వేలకు పైగా గృహాలున్నాయి. రైల్వే ఉద్యోగుల కుటుంబాలతో పాటు చుట్టుపక్కల ప్రైవేట్ కాలనీల ప్రజలకు ఈ ప్రాంతంలో స్టేషన్ లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఇక్కడ కొత్త స్టేషన్ నిర్మిస్తే వేలాది మందికి నేరుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం దక్కుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ఎంఎంటీఎస్ రెండో దశ పనుల కోసం తన వంతు నిధులను విడుదల చేస్తూ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, శివారు ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు కొత్త స్టేషన్లు పూర్తయితే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అత్యంత చౌకైన, వేగవంతమైన రవాణా మార్గం అందుబాటులోకి వస్తుంది. రైల్వే బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.








