Mahaa Daily Exclusive

  బెంగాల్‌లో నూతన అధ్యాయం….

Share

బెంగాల్‌లో నూతన అధ్యాయం.
* డబుల్ ఇంజిన్’ సర్కారు దూకుడు.
* తొలి కేబినెట్‌ భేటీలోనే ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయాలు.
* 45 రోజుల్లో బీఎస్‌ఎఫ్‌కు సరిహద్దు భూముల బదిలీ ప్రక్రియ పూర్తికి ఆదేశం.
* రాష్ట్రంలో తక్షణమే ఆయుష్మాన్ భారత్, పెండింగ్‌లో ఉన్న జనగణన ప్రక్రియ షురూ.
* ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు గరిష్ఠ వయోపరిమితి ఐదేళ్లు పెంపు.
* పాత సంక్షేమ పథకాలన్నీ యథాతథం.. అమరవీరుల కుటుంబాలకు భరోసా.
హైదరాబాద్, మహా.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పరిపాలనలో నూతన శకం ఆరంభమైంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా అధికార పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ.. పాలనను పరుగులు పెట్టించే దిశగా తన తొలి అడుగుల్లోనే ఉద్దేశాన్ని చాటుకుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో సోమవారం జరిగిన రాష్ట్ర తొలి మంత్రివర్గ సమావేశంలో అనేక సంచలన, చారిత్రక నిర్ణయాలకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలో ఉన్న ప్రతిష్టంభనకు పూర్తిగా తెరదించుతూ.. జాతీయ భద్రత, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే అత్యున్నత లక్ష్యాలుగా ఈ తొలి మంత్రివర్గ భేటీ సాగడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా దేశ భద్రతకు ముప్పుగా మారిన బంగ్లాదేశ్‌ సరిహద్దుల రక్షణపై నూతన ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. సరిహద్దుల వెంబడి కంచె నిర్మాణం కోసం అవసరమైన భూమిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు (బీఎస్‌ఎఫ్) బదిలీ చేయాలని నిర్ణయించింది. కేవలం 45 రోజుల్లోనే ఈ భూ బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు అత్యంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గత ప్రభుత్వం రాజకీయ కారణాలతో నిలిపివేసిన అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలకు నూతన కేబినెట్ పచ్చజెండా ఊపింది. పేదలకు అత్యుత్తమ వైద్యం అందించే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను బెంగాల్‌లో తక్షణమే అమలు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వంతో అవసరమైన సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి కృషిక్ బీమా యోజన, పీఎం శ్రీ (PM SHRI), విశ్వకర్మ పథకం, బేటీ బచావో బేటీ పఢావో, ఉజ్వల యోజన వంటి కీలక జాతీయ పథకాలను రాష్ట్రంలో అత్యంత చురుగ్గా అమలు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా, గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టిన జనగణన (సెన్సస్) ప్రక్రియను సోమవారం నుంచే పునఃప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర క్యాడర్ అధికారులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించాలని కేబినెట్‌లో తీర్మానించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేయకుండా అడ్డుకున్న నూతన క్రిమినల్‌ చట్టాలను సైతం బెంగాల్‌లో తక్షణమే అమలు చేయాలని మంత్రివర్గం గట్టి నిర్ణయం తీసుకుంది.
నిరుద్యోగులు, సామాన్య ప్రజలకు కూడా ముఖ్యమంత్రి సువేందు అధికారి గుడ్‌న్యూస్ చెప్పారు. ఉపాధ్యాయ, పాఠశాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని ఏకంగా ఐదేళ్ల పాటు పెంచుతున్నట్లు కేబినెట్ ద్వారా ప్రకటించారు. ప్రభుత్వ మార్పుతో పాత పథకాలు రద్దు అవుతాయన్న వదంతులను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ‘లక్ష్మీర్ భండార్’ వంటి ఏ ఒక్క సామాజిక సంక్షేమ పథకాన్ని తమ ప్రభుత్వం నిలిపివేయబోదని, అవన్నీ యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అయితే, లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఉన్నా, లేదా భారత పౌరసత్వం లేని చొరబాటుదారులు ఆ పథకాల ప్రయోజనాలు పొందుతున్నట్లు తేలినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుని ఏరివేస్తామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ హింసకు చరమగీతం పాడుతామని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆదర్శాలతో, “ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల చేత” అనే ప్రజాస్వామ్య సూత్రానికి కట్టుబడి తమ ‘డబుల్ ఇంజిన్’ సర్కారు పనిచేస్తుందని ముఖ్యమంత్రి సువేందు అధికారి భరోసా ఇచ్చారు. దేశంలోని ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు అనుసరిస్తున్న అభివృద్ధి మార్గంలోనే బెంగాల్‌ను పరుగులు పెట్టిస్తామన్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో బీజేపీకి చెందిన 321 మంది అమరవీరులకు మంత్రులు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్రంలో భయం, హింసకు తావులేని విధంగా అత్యంత నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించిన యంత్రాంగానికి, ఈ చారిత్రక ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ రాష్ట్ర కేబినెట్ ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.