లంక బిందెల కోసమే శివాలయ విధ్వంసం.
* స్కూళ్ల టెండర్లలో రూ. 500 కోట్ల భారీ కుంభకోణం.
* బడి పేరుతో గుడిని కూల్చేసిన రేవంత్ సర్కారు.. అర్ధరాత్రి 24 అడుగుల తవ్వకాలు.
* కాకతీయుల నాటి 800 ఏళ్ల చరిత్ర గల మట్టికోట ఆలయం నేలమట్టం.
* కేసీఆర్ గుడులు కడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడుతోంది.
* ఆ కాంట్రాక్టర్లు నా మనుషులే అయితే దమ్ముంటే టెండర్లు రద్దు చేయి.
* ముఖ్యమంత్రికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు బహిరంగ సవాల్.
* నర్సంపేట నియోజకవర్గం అశోక్ నగర్‌లో ధ్వంసమైన ఆలయం పరిశీలన.
నర్సంపేట,మహా.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడులను ఆగం చేయడమే కాకుండా, ఏకంగా గుడుల విధ్వంసానికి తెరతీసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణమనే సాకుతో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఉన్న 800 ఏళ్ల కాకతీయుల నాటి చారిత్రక మట్టికోట శివాలయాన్ని గుప్త నిధుల కోసమే నేలమట్టం చేశారని ఆయన ఆరోపించారు. స్థానికంగా ధ్వంసమైన ఆలయ ప్రాంగణాన్ని ఆదివారం బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి హరీశ్ రావు పరిశీలించారు. కూల్చివేతకు గురైన ప్రాంతంలో స్థానికులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై, విద్యాశాఖలో జరుగుతున్న అవినీతిపై సంచలన ఆరోపణలు చేశారు.
**రేవంత్ డైరెక్షన్‌లోనే గుప్త నిధుల వేట**
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవుడంటే భయం, భక్తి ఏ కోశానా లేవని హరీశ్ రావు మండిపడ్డారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేయకుండా మాట తప్పిన చరిత్ర ఆయనకే దక్కుతుందన్నారు. గతంలో కేసీఆర్ యాదాద్రి లాంటి మహా పుణ్యక్షేత్రాలను అత్యంత వైభవంగా నిర్మిస్తే, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా పేరుతో పేదల ఇండ్లు, మసీదులు, చర్చీలు కూల్చడమే కాకుండా ఇప్పుడు ఏకంగా పురాతన దేవాలయాలపై పడ్డారని విమర్శించారు. సీఎం అయిన కొత్తలో సచివాలయానికి వెళితే లంక బిందెలు దొరుకుతాయని భావించిన రేవంత్ రెడ్డి, తన అనుయాయులతో కలిసి నిజాం భవనాల చుట్టూ గుప్త నిధుల కోసం అన్వేషించారని, అక్కడ ఏమీ దొరక్కపోయే సరికి ఇప్పుడు కాకతీయుల గుడులను లక్ష్యంగా చేసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అశోక్ నగర్ లో కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని ఉద్దేశపూర్వకంగానే కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ రక్షణ కోసం ఉన్న అతిపెద్ద మట్టి ఆనకట్టను తొలుచుకుంటూ వెళ్లి గర్భగుడిని ధ్వంసం చేశారని, రాత్రి 12 నుంచి 1 గంట మధ్య చీకట్లో గర్భగుడి కింద ఏకంగా 24 అడుగుల లోతు భారీ గుంత తవ్వారని ఆధారాలతో సహా వివరించారు. స్కూల్ నిర్మించడమే లక్ష్యమైతే పగటి పూట పనులు చేయవచ్చని, కానీ అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం వెనుక రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన గుప్త నిధుల వేటే కారణమని ఆయన స్పష్టం చేశారు.
**అధికారుల మౌనం వెనుక మతలబు అదే..**
గుప్త నిధుల కోసమే ఈ తవ్వకాలు జరిగాయని పురావస్తు శాఖ జిల్లా అధికారి స్వయంగా ఈ నెల 7వ తేదీన కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని హరీశ్ రావు తప్పుబట్టారు. యంత్రాలను సీజ్ చేయకపోవడం, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ఈ విధ్వంసం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నది తేటతెల్లమవుతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్‌లో ఇది స్పష్టంగా దేవాలయ భూమిగా నమోదై ఉంటే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూభారతిలో రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిగా ఎలా మారిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. స్కూల్ నిర్మించడానికి నియోజకవర్గంలో అనువైన స్థలాలు ఎన్నో ఉన్నప్పటికీ, మరెక్కడో జీవో వచ్చిన స్కూల్‌ను ఇక్కడికే ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. బడి కోసం గుడిని కూలగొట్టాల్సిన ఖర్మ ఏమొచ్చిందని నిలదీశారు. పురావస్తు శాఖ ఫిర్యాదు ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధ్యులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1958 చట్టం ప్రకారం వందేళ్లు దాటిన కట్టడాలు ఆర్కియాలజీ పరిధిలోకి వస్తాయని, వెంటనే ఈ స్థలాన్ని పురావస్తు శాఖకు అప్పగించి, యుద్ధప్రాతిపదికన చారిత్రక శివాలయాన్ని పునరుద్ధరించాలని కోరారు. అర్ధరాత్రి తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధులు, లంక బిందెలు ఏ ప్రభుత్వ పెద్దల ఇళ్లకు చేరాయో సమగ్ర విచారణ జరగాలని, దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు.
**ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో రూ. 500 కోట్ల లూటీ**
ఒకవైపు గుడులు కూలుస్తుంటే, మరోవైపు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కూళ్ల టెండర్ల ముసుగులో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పిలిస్తే, ఒక్క టెండర్ కూడా తక్కువ ధరకు పోకుండా అన్నీ 4.86, 4.96, 4.99 శాతం ఎక్సెస్ (అదనపు) ధరలకే కట్టబెట్టారని గణాంకాలతో సహా వివరించారు. ఈ స్కూళ్ల టెండర్లలో ఏకంగా రూ. 494 కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందన్నారు. ఉదాహరణకు నర్సంపేట ప్యాకేజ్-8 కింద రూ. 136 కోట్లకు టెండర్ ఉండగా, దానిని అడ్డగోలుగా 4.86% ఎక్సెస్‌తో రూ. 142 కోట్లకు అప్పగించారని తెలిపారు. తమకు అనుకూలంగా పనులు చక్కబెట్టుకునేందుకు ఒక రిటైర్డ్ అధికారిని ఏకంగా చీఫ్ ఇంజనీర్‌గా నియమించుకుని ఈ రూ. 500 కోట్ల దోపిడీకి తెరతీశారని ఆరోపించారు.
ఈ టెండర్లు దక్కించుకున్న వాళ్లు హరీశ్ రావు మనుషులే అని రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. “ఆ కాంట్రాక్టర్లు నా మనుషులే అయితే వెంటనే ఆ టెండర్లను రద్దు చేయి. నేనే స్వయంగా రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాను. దమ్ముంటే రద్దు చేసి చూపించు” అని ముఖ్యమంత్రికి బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజల చెమట చుక్కల ఆదాయాన్ని లూటీ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, మొన్నటి ‘హ్యామ్’ రోడ్ల టెండర్లలో జరిగిన రూ. 5000 కోట్ల కుంభకోణాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టింది తానేనని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ 5 శాతానికి మించి ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదని, తక్షణమే మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను రద్దు చేసి ప్రజాధనం లూటీని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.








