Mahaa Daily Exclusive

  అధికారం శాశ్వతం కాదు…..

Share

అధికారం శాశ్వతం కాదు.
* ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి.
* కేంద్ర నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వ మనుగడ.
* హామీలు గాలికొదిలేసి ప్రధానిపై విమర్శలా?
* కేసీఆర్‌కు పట్టిన గతే మీకూ పడుతుంది.
* దేశ ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీ విజ్ఞప్తి.
* బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ధ్వజం.
హైదరాబాద్, మహా .

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో దేశ ప్రజల శ్రేయస్సు కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నారని, ఆయన మార్గదర్శకత్వంలోనే తాము నడుచుకుంటామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ ధరలు మండిపోతున్నాయని, అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం ధరల సెగ కనిపిస్తోందని వారు గుర్తుచేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక మూలాలు దెబ్బతినకుండా ఉండేందుకే.. స్వదేశీ ఉత్పత్తులను ఎక్కువగా వాడాలని, విదేశీ మారక ద్రవ్యం వృథా కాకుండా చూడాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారని తెలిపారు. దేశ ప్రధాని స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారంటే పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. ఆయన పిలుపును ప్రజలంతా అందిపుచ్చుకుని దేశ స్వావలంబన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేడ్ ఇన్ ఇండియా’ కోసం మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. తమ పార్టీలో సమర్థులైన నాయకత్వానికి ఏమాత్రం కొదవలేదని ఈ సందర్భంగా వారు ఉద్ఘాటించారు.
ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికార పక్ష నేతల తీరుపై వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు నిధులు ఇవ్వాలని కోరడం, ఆయన వెళ్లగానే ఏమీ ఇవ్వలేదంటూ రాజకీయ విమర్శలు చేయడం ఇక్కడి నాయకులకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలపై విమర్శలు చేసే ముందు గత పాలకుల చరిత్రను గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సైతం ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ‘మాకు నిధులు ఏమీ వద్దు.. మీ ప్రేమ చాలు’ అని గొప్పలు చెప్పారని, ఆ తర్వాత కొన్నాళ్లకే ‘ఏం ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారు?’ అంటూ విమర్శలకు దిగారని గుర్తుచేశారు. అలా అహంకారంతో మాట్లాడిన కేసీఆర్ ఏమయ్యాడో, ఆయనకు ఎలాంటి గతి పట్టిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని హెచ్చరించారు.
నేడు రాష్ట్ర ప్రభుత్వం బండి నెట్టుకొస్తోందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల వల్లేనన్న నగ్న సత్యాన్ని అధికార పక్షం గ్రహించాలని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదని దుయ్యబట్టారు. పాలన చేతకాక, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నెపం నెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు తమ మాటలను జాగ్రత్తగా అదుపులో ఉంచుకుని మాట్లాడాలని, ప్రజాస్వామయంలో ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరని, కుర్చీలు వస్తుంటాయి.. పోతుంటాయన్న సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలని వారు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.