Mahaa Daily Exclusive

  పోక్సో కేసులో భగీరథ్‌కు దక్కని ఊరట…

Share

పోక్సో కేసులో భగీరథ్‌కు దక్కని ఊరట.
• ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు.
• నేటికి వాయిదా వేసిన న్యాయస్థానం.
• అరెస్ట్ ముప్పు ఉందన్నా స్పందించని న్యాయమూర్తి.
• మేజర్ అమ్మాయిని మైనర్‌గా చూపించి కేసు పెట్టారు.
• హైకోర్టులో భగీరథ్ తరపు న్యాయవాది వాదనలు.

హైదరాబాద్, మహా.

సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు మరియు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బండి భగీరథ్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానానికి వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో ఫస్ట్ వెకేషన్ కోర్టులో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. మంగళవారం (ఈనెల 12వ తేదీన) భగీరథ్ తరపు న్యాయవాది నవీన్ కుమార్ ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయగా, గురువారం నాటి విచారణ జాబితాలో ఇది 28వ కేసుగా నమోదై మధ్యాహ్నం సమయంలో న్యాయమూర్తి ముందుకు విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌పై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు బనాయించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బాధితురాలిగా చెబుతున్న అమ్మాయి వాస్తవానికి మేజర్ అని, కానీ ఆమెను ఉద్దేశపూర్వకంగా మైనర్‌గా చూపించి అత్యంత కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద తప్పుడు కేసు నమోదు చేశారని నిరంజన్ రెడ్డి వాదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. అమ్మాయి మేజర్ అని నిరూపించేందుకు అవసరమైన పక్కా ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించాలని భగీరథ్ తరపు న్యాయవాదిని ఆదేశించారు.
ఇదే సమయంలో భగీరథ్ అరెస్టుకు సంబంధించి కోర్టు హాల్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ క్లయింట్‌ను ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేసే ప్రమాదం పొంచి ఉందని, అందువల్ల ఈ కేసులో అత్యవసరంగా ఈరోజే మధ్యంతర ఉత్తర్వులు లేదా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునివ్వాలని న్యాయవాది నిరంజన్ రెడ్డి న్యాయమూర్తిని పదే పదే అభ్యర్థించారు. అయినప్పటికీ న్యాయమూర్తి ఈ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేమని, శుక్రవారం నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ప్రభుత్వ న్యాయవాది) వాదనలు కూడా పూర్తిగా విన్న తర్వాతే ఈ బెయిల్ పిటిషన్‌పై తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు.
మరోవైపు బండి భగీరథ్ వ్యవహారశైలి ఆయనకు చట్టపరంగా తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పోక్సో కేసు నమోదు అయినప్పటి నుంచి ఆయన పోలీసుల విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టడమే కాకుండా, పోలీసులకు చిక్కకుండా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. చట్టం ముందు నిలబడకుండా ఇలా పరారీలో ఉండటం, దర్యాప్తుకు సహకరించకపోవడం వంటి అంశాలను పోలీసులు కోర్టులో బలంగా వినిపిస్తే బెయిల్ రావడం దాదాపు అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలే పోక్సో లాంటి తీవ్రమైన కేసుల్లో సాధారణంగా ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి న్యాయస్థానాలు సుముఖత చూపించవని, దానికి తోడు నిందితుడు పరారీలో ఉండటం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించే వాదనలు, కోర్టు తీసుకునే నిర్ణయంపైనే బండి భగీరథ్ భవితవ్యం ఆధారపడి ఉందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముందస్తు బెయిల్ లభించని పక్షంలో భగీరథ్ అరెస్ట్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.