Mahaa Daily Exclusive

  ప్రాణనష్టం ‘సున్నా’ చేయడమే లక్ష్యం..

Share

ప్రాణనష్టం ‘సున్నా’ చేయడమే లక్ష్యం.
• విపత్తు నిర్వహణలో ప్రపంచానికే రోల్ మోడల్ భారత్.
• ఆపదలో ఆపద్బాంధవుడు ఎన్డీఆర్ఎఫ్.
• ఎన్డీఆర్ఎఫ్ సేవలపై కేంద్ర హోం మంత్రి ప్రశంసలు.

హైదరాబాద్, మహా.

దేశంలో విపత్తు నిర్వహణ, సహాయక చర్యల్లో అహర్నిశలు శ్రమిస్తున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి అత్యున్నత గౌరవం దక్కింది. గత 20 ఏళ్లుగా ఆ దళం ప్రదర్శిస్తున్న అసాధారణ ధైర్యసాహసాలు, అంకితభావానికి గుర్తింపుగా రాష్ట్రపతి ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘ప్రెసిడెంట్స్ కలర్’ అవార్డును కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రదానం చేశారు. ఘజియాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ అవార్డు కేవలం ఎన్డీఆర్ఎఫ్‌కే కాకుండా విపత్తు నిర్వహణలో పాలుపంచుకుంటున్న పంచాయతీలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు వలంటీర్లందరికీ దక్కిన అరుదైన గౌరవమని అమిత్ షా ఈ సందర్భంగా కొనియాడారు. “ఆపద సేవ సదైవ సర్వత్ర” అనే నినాదంతో ఎన్డీఆర్ఎఫ్ దళాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అపారమైన భద్రతా భావాన్ని కల్పిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. విపత్తు సమయంలో వారు ఘటనా స్థలానికి చేరుకోగానే ప్రజల్లో కొండంత భరోసా కలుగుతుందన్నారు. ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు 1.5 లక్షల మంది ప్రాణాలను కాపాడటంతో పాటు, 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి మానవత్వాన్ని చాటుకున్నాయని ఆయన వెల్లడించారు.
గతంలో విపత్తు నిర్వహణ అంటే కేవలం విపత్తు జరిగిన తర్వాత చేపట్టే ‘సహాయక చర్యల’కే పరిమితమయ్యేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని అమిత్ షా వివరించారు. దీనిని ముందస్తు నివారణ మరియు ఉత్పాదక విధానంగా మలిచామన్నారు. విపత్తుల సమయంలో గతంలో కనిష్ట ప్రాణనష్టం లక్ష్యంగా ఉండగా, ఇప్పుడు ‘సున్నా ప్రాణనష్టం’ (జీరో క్యాజువాలిటీ) సాధించడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎండదెబ్బ (హీట్‌వేవ్స్) కారణంగా సంభవించే మరణాలను పూర్తిగా సున్నాకు తగ్గించే దిశగా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు ఉద్దేశించిన రూ. 116 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను అమిత్ షా ఈ వేదికగా లాంఛనంగా ప్రారంభించారు.
విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచే క్రమంలో శిక్షణకు కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అమిత్ షా వెల్లడించారు. గత రెండేళ్ల వ్యవధిలోనే 8,500 మంది సిబ్బందికి, 2.20 లక్షల మంది వలంటీర్లకు, అలాగే 10,500 మంది బోటు నడిపే వారికి విపత్తు నిర్వహణలో ప్రత్యేక శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ముందంజలో ఉన్నాయని, దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతకు తమ వంతు తోడ్పాటు అందించారని కొనియాడారు.
విపత్తు నిర్వహణలో నేడు భారత్ ప్రపంచానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచిందని కేంద్ర హోం మంత్రి ఉద్ఘాటించారు. ‘వసుధైక కుటుంబం’ అనే మహోన్నత స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో విపత్తులు సంభవించినప్పుడు ‘ఫస్ట్ రెస్పాండర్’ (తొలుత స్పందించే దేశం)గా భారత్ ఎదిగిందని ఆయన గర్వంగా చెప్పారు. విపత్తులను తట్టుకోగల పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సీడీఆర్ఐ కూటమిలో ప్రస్తుతం 48 దేశాలు సభ్యులుగా చేరడం మన దేశ నాయకత్వ పటిమకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.