Mahaa Daily Exclusive

  కేంద్ర దర్యాప్తు సంస్థ బాస్‌గా ప్రవీణ్ సూద్ కంటిన్యూ….

Share

కేంద్ర దర్యాప్తు సంస్థ బాస్‌గా ప్రవీణ్ సూద్ కంటిన్యూ.
* మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగించిన కేంద్రం.
* నీట్ కేసుదర్యాప్తు వేళ కేంద్రం కీలక అడుగు.
* ప్రధాని నేతృత్వంలోని కమిటీ కీలక పరిణామాలు.
* సీబీఐ డైరెక్టర్‌ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ.
హైదరాబాద్, మహా.
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నాయకత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయించింది. వాస్తవానికి ఆయన ప్రస్తుత పదవీ కాలం ఈ నెల 24వ తేదీతో ముగియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన సేవలను దర్యాప్తు సంస్థకు మరింత కాలం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరిస్తూ కేంద్ర అపాయింట్‌మెంట్స్ కమిటీ క్యాబినెట్ కార్యదర్శి మనీషా సక్సేనా గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పొడిగింపునకు ముందు దేశ రాజధానిలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. సీబీఐ తదుపరి డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి సెలక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం దిల్లీలోని ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ అత్యున్నత కమిటీలో ప్రధాని మోదీతో పాటు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ కమిటీ పరిశీలనకు వచ్చిన అధికారుల జాబితాలో పరాగ్ జైన్, యోగేశ్ గుప్తా, జీపీ సింగ్, శత్రుజీత్ కపూర్, ప్రవీర్ రంజన్‌లతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఈ ఎంపిక ప్రక్రియపై విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్షపాతంతో కూడిన చర్యల్లో తాను భాగస్వామిని కాలేనంటూ తన తీవ్ర భేదాభిప్రాయాన్ని వెల్లడించిన ఆయన, ఏకంగా రెండు పేజీల అసమ్మతి నోట్‌ను ప్రధాని మోదీకి అందించారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించడానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసిందని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టమైంది.
ప్రవీణ్ సూద్‌కే మళ్లీ ఈ కీలక బాధ్యతలు ఎందుకు అప్పగించారనే దానిపై అధికార వర్గాలు స్పష్టతనిచ్చాయి. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీక్ కేసుతో సహా, పలు అత్యంత కీలకమైన, రాజకీయంగా సున్నితమైన కేసుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. ఇలాంటి కీలక తరుణంలో సీబీఐ అగ్ర నాయకత్వంలో ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయతను నిర్ధారించేందుకే సూద్‌కు ఈ పొడిగింపు ఇచ్చారని అధికారులు వెల్లడించారు. పనులను, విచారణలను స్వయంగా పర్యవేక్షించే వ్యక్తిగా పేరుగాంచిన ప్రవీణ్ సూద్, ఈ అత్యంత సున్నితమైన కేసుల దర్యాప్తును ప్రస్తుతం నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, దర్యాప్తు గాడితప్పకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు పేర్కొన్నారు.
చట్టపరమైన నిబంధనలను అనుసరించే ఈ పదవీకాల పొడిగింపు జరిగింది. సీబీఐ పనితీరును నియంత్రించే ‘ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946’ చట్టానికి 2021లో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణల ప్రకారం ఆయనకు ఈ అవకాశం లభించింది. సీబీఐ డైరెక్టర్ పదవీకాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించేందుకు వీలుగా, పార్లమెంటు 2021 డిసెంబర్ 14న ఈ DSPE (సవరణ) బిల్లును ఆమోదించింది. డిసెంబర్ 18, 2021న రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత ఇది పూర్తిస్థాయి చట్టంగా మారింది. సవరించిన ఈ చట్టం ప్రకారం.. ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సీబీఐ డైరెక్టర్ పదవీకాలాన్ని “ఒకసారికి ఒక సంవత్సరం చొప్పున” పొడిగించే విశేష అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది. అయితే ప్రారంభ నియామక సమయంలో పేర్కొన్న కాలాన్ని కలుపుకుని, మొత్తం ఐదేళ్ల కాలం పూర్తయిన తర్వాత అటువంటి పొడిగింపు ఏదీ ఇకపై అమలు కాదని ఆ చట్టం స్పష్టం చేస్తోంది.
ప్రవీణ్ సూద్ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఆయన 1964లో హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలో జన్మించారు. చదువులో ముందునుంచే చురుకుగా ఉండే ఆయన, దిల్లీలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తర్వాత సివిల్స్ పరీక్షలు రాసి కేవలం 22 ఏళ్ల చిన్న వయసులోనే ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. 1986 బ్యాచ్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి, తన సుదీర్ఘ వృత్తి ప్రస్థానంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా రెండేళ్ల కాల వ్యవధితో తొలిసారిగా నియమితులయ్యారు. ఆ పదవీ కాలం గతేడాది మే నెలతో ముగియగా, అప్పుడు ఆయన పదవీ కాలాన్ని తొలిసారిగా పొడగించారు. ఇప్పుడు తాజాగా మరోసారి కూడా ఆయన సేవలను విశ్వసించిన కేంద్రం, ఆయన పదవీ కాలాన్ని మరింత పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.