- రాయలసీమలో డిఫెన్స్ విప్లవం
- పుట్టపర్తిలో దేశంలోనే తొలి 5 వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శ్రీకారం
- శంకుస్థాపన చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
- లక్ష కోట్ల పెట్టుబడులు, 7500 మందికి ప్రత్యక్ష ఉపాధి
పుట్టపర్తి, మహా : చరిత్రలో రతనాల సీమగా, ప్రస్తుతం ఉద్యాన సీమగా వెలుగొందుతున్న రాయలసీమ.. ఇకపై భవిష్యత్తులో దేశ రక్షణ సీమగా సరికొత్త ముద్ర వేయనుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శుక్రవారం దేశం గర్వించదగ్గ అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ భూమి పూజలో పాల్గొన్నారు. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్డీఓ సంయుక్తంగా సుమారు రూ. 15,803 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును 650 ఎకరాల్లో నిర్మించనున్నాయి. ఇది భారత్‌లో మొట్టమొదటి 5వ తరం స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్ మాధవ్, తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమకు మహర్ధశ
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా యుద్ధ విమానాల అభివృద్ధి, టెస్టింగ్ పుట్టపర్తిలోనే జరుగుతాయి. దీనివల్ల దాదాపు 7,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా భవిష్యత్తులో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న ‘డ్రోన్ సిటీ’ ద్వారా భారత్‌లోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్‌ను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాజధాని అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మధ్యాహ్నం వరకు అక్కడ జరిగే పలు రక్షణ, డ్రోన్ రంగ పరిశ్రమల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు మరో 12 రక్షణ, డ్రోన్ రంగ ప్రాజెక్టులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ (రూ. 1,430 కోట్లు), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (రూ. 489 కోట్లు), హెచ్ఎఫ్ సీఎల్ (రూ. 1,040 కోట్లు) వంటి దిగ్గజ సంస్థలు ఇందులో ఉన్నాయి. ఈ 12 ప్రాజెక్టుల ద్వారా మొత్తం రూ. 4,145 కోట్ల పెట్టుబడులు, సుమారు 6,071 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వీటిలో ప్రధానంగా మడకశిర, దొనకొండ, నెల్లూరు, కర్నూలు డ్రోన్ సిటీలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. మొత్తంగా రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఈ భారీ అడుగు వేసింది. వీటితో పాటు మరో 12 ప్రాజెక్టులకు శంకుస్థాపన… పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ – రూ. 1430 కోట్ల పెట్టుబడి ద్వారా 565 మందికి ఉపాధి లభించనుంది. హెచ్ఎప్ సీఎల్ రూ. 1040 కోట్ల పెట్టుబడితో 870 మందికి ఉపాధి దొరకనుంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ – రూ. 489 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ – రూ. 500 కోట్ల పెట్టుబడితో 2050 మందికి ఉపాధి. డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ. 255 కోట్ల పెట్టుబడి ద్వారా 850 మందికి ఉపాధి. హెచ్ సి రోబోటిక్స్ రూ. 100 కోట్ల పెట్టుబడి వల్ల 500 మందికి ఉపాధి. ఎయిర్ పేస్ ఇండస్ట్రీస్ రూ. 100 కోట్ల పెట్టుబడితో 150 మందికి ఉపాధి. జేడీకే ఫ్లై డ్రోన్ వరల్డ్ రూ. 114 కోట్ల పెట్టుబడి వల్ల 350 మందికి ఉపాధి. సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్ రూ. 68 కోట్ల పెట్టుబడితో 45 మందికి ఉపాధి. అల్గోబాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 34 కోట్ల పెట్టుబడితో 52 మందికి ఉపాధి. లాట్రిక్ ఎయిరో స్పేస్ రూ. 10 కోట్ల పెట్టుబడితో 125 మందికి ఉపాధి. డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్ రూ. 5 కోట్ల పెట్టుబడితో 14 మందికి ఉపాధి లభించనుందని అధికారులు పేర్కొన్నారు.







