భారత్‌కు తిరిగి రానున్న 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద.
* నెదర్లాండ్స్ పర్యటనలో ప్రధాని మోదీకి ఫలకాల అప్పగింత.
* లైడెన్ విశ్వవిద్యాలయానికి మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు.
* 17 ఒప్పందాలపై సంతకాలు.
హైదరాబాద్, మహా.
భారతదేశం అద్భుత దౌత్య, సాంస్కృతిక విజయాన్ని సొంతం చేసుకుంది. 11వ శతాబ్దానికి చెందిన అత్యంత అరుదైన చారిత్రక ‘చోళ రాగి ఫలకాలు’ నెదర్లాండ్స్ నుంచి మాతృభూమికి చేరుకోనున్నాయి. డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్ సమక్షంలో శనివారం జరిగిన ఒక ఉన్నత స్థాయి కార్యక్రమంలో ఈ అమూల్యమైన కళాఖండాలను భారత ప్రధాని నరేంద్ర మోదీకి నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా అప్పగించింది. ఈ అపురూపమైన వారసత్వ సంపదను 19వ శతాబ్దం మధ్యకాలం నుంచి అత్యంత భద్రంగా కాపాడిన నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, లైడెన్ విశ్వవిద్యాలయానికి ప్రధాని మోదీ ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక, సాంస్కృతిక బంధాలకు శక్తివంతమైన ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు.
**చోళుల పరాక్రమానికి సజీవ సాక్ష్యం**
చారిత్రక ఫలకాలను తిరిగి పొందడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఆనందకరమైన క్షణమని ఆయన అభివర్ణించారు. చోళుల రాగి ఫలకాల్లో 21 పెద్దవి, 3 చిన్నవి ఉన్నాయని.. ప్రపంచంలోని అత్యంత మధురమైన భాషల్లో ఒకటైన తమిళంతో పాటు సంస్కృతంలో ఈ రచనలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మొదటి రాజరాజ చక్రవర్తి చేసిన మౌఖిక వాగ్దానాన్ని ఆయన కుమారుడు, రాజేంద్ర చోళుడు-I అధికారికంగా నెరవేర్చడానికి సంబంధించిన ఆధారాలు ఈ ఫలకాల్లో ఉన్నాయని తెలిపారు. సముద్రయానంలో చోళుల పరాక్రమానికి, వారి గొప్ప సంస్కృతికి ఈ ఫలకాలు సజీవ సాక్ష్యాలని ప్రధాని పేర్కొన్నారు.
**30 కిలోల బరువు.. 21 రాగి ఫలకాలు**
ఈ చారిత్రక సంపదను నెదర్లాండ్స్‌లో ‘లైడెన్ ఫలకాలు’గా, భారతదేశంలో ‘అనైమంగళం రాగి ఫలకాలు’గా పిలుస్తారు. చోళ సామ్రాజ్య అధికారిక రాజముద్రను కలిగిన ఒక భారీ కంచు ఉంగరానికి ఈ 21 రాగి ఫలకాలను గుచ్చారు. వీటి మొత్తం బరువు సుమారు 30 కిలోగ్రాములు ఉంటుంది. భారతదేశ సరిహద్దుల వెలుపల ఆ రాజవంశానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఆధారాల్లో ఇది ఒకటి. ఈ ప్రాచీన శాసనాలను తిరిగి మాతృదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం 2012 నుంచి అవిశ్రాంతంగా చేసిన దౌత్యపరమైన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. విదేశాలకు తరలిపోయిన భారతీయ వారసత్వ సంపదను వెనక్కి రప్పించడంలో కేంద్రం సాధిస్తున్న విజయాలకు ఇది మరో ప్రతీకగా నిలిచింది.
**నెదర్లాండ్స్‌తో 17 కీలక ఒప్పందాలు**
వారసత్వ సంపద అప్పగింతతో పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. భారత్, నెదర్లాండ్స్ దేశాలు తమ బంధాన్ని ‘వ్యూహాత్మక భాగస్వామ్య’ స్థాయికి పెంచుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల్లో రక్షణ, కీలక ఖనిజాలు తదితర రంగాలకు సంబంధించి 17 ముఖ్యమైన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
**పశ్చిమాసియా పరిస్థితులపై ఆందోళన**
ఈ సందర్భంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఇరువురు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ ఎనర్జీ సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌లకు ఆటంకాలు కలగడం వల్ల ఆ ప్రాంతంతో పాటు ప్రపంచంపై పడే ప్రతికూల ప్రభావాలపై సమాలోచనలు జరిపారు. హర్మూజ్ జలసంధి మీదుగా నౌకాయాన స్వేచ్ఛ, అంతర్జాతీయ వాణిజ్య ప్రవాహం నిరాటంకంగా కొనసాగాలని మోదీ, జెట్టెన్ స్పష్టం చేశారు. నియంత్రణ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వాణిజ్య స్వేచ్ఛకు మద్దతు కొనసాగిస్తామని ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. అలాగే, ఉక్రెయిన్-రష్యా ఘర్షణలు, ప్రాంతీయ భద్రత తదితర అంశాలపైనా చర్చించిన నేతలు.. దౌత్యం, శాంతియుత చర్చల ద్వారానే ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతి సాధ్యమని ఉద్ఘాటించారు.
**అఫ్స్లూయిట్డైక్ డ్యామ్ సందర్శన**
ఆదివారం నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ అఫ్స్లూయిట్డైక్ డ్యామ్‌ను సందర్శించారు. నిర్మాణపరంగా అద్భుతంగా పేరొందిన ఈ డ్యామ్ విశేషాలను, ఇంజనీరింగ్ నైపుణ్యాలను డచ్ అధికారులు ప్రధానికి వివరించారు.








