Mahaa Daily Exclusive

  ధాన్యం కొనుగోళ్లలో వైఫల్యం చెంది.. కేంద్రంపై నిందలా?

Share

ధాన్యం కొనుగోళ్లలో వైఫల్యం చెంది.. కేంద్రంపై నిందలా?
• రైతుల ఉసురు పోసుకుంటున్న రాష్ట్ర సర్కారు.
• ఉచిత బియ్యం,సన్న బియ్యం వెనుక ఉన్నది కేంద్రమే.
• అక్రమ చొరబాటుదారుల ఓట్లు పీకేస్తాం.. ఈసీకి సహకరించండి.
• పెట్రోల్‌పై అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్నది తెలంగాణే.
• కాంగ్రెస్ సర్కారుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్.

హైదరాబాద్, మహా.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిక్లరేషన్ల పేరుతో ఎన్నో ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వైఫల్యం, ఓటర్ల జాబితా సవరణపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, పెట్రోల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. పాలనాపరమైన తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కనీసం కొనుగోలు చేయలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తూ, రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర మంత్రులకు, అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. మంత్రులు ఏసీ గదుల్లో కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టడం మానేసి, నేరుగా జిల్లాలకు వెళ్లి కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలని హితవు పలికారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి బస్తాలు, రవాణా ఛార్జీలు, గోదాముల అద్దె, బ్యాంకు రుణాలకు వడ్డీ ఇలా ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని, రాష్ట్రంపై ఒక్క రూపాయి భారం పడకపోయినా కొనుగోళ్లలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. యూపీఏ హయాంలో క్వింటాలుకు కేవలం రూ.1300 ఉన్న మద్దతు ధరను, మోదీ ప్రభుత్వం రూ.2360కు పెంచిందని గుర్తుచేశారు. అలాగే, ఎకరాకు పది క్వింటాళ్ల పత్తి పండిస్తే రైతుకు దాదాపు రూ.46 వేల లాభం వచ్చేలా క్వింటాలు పత్తికి రూ.8660 మద్దతు ధరను కేంద్రమే అందిస్తూ నేరుగా కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. పది పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని మోసం చేసి, తీరా ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే, అది కూడా సగం మందికే ఇస్తూ రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన దుయ్యబట్టారు. ఫసల్ బీమా యోజన అమలులోనూ రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార పంపిణీ పథకాన్ని (లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కేజీ బియ్యంపై రూ.40 ఖర్చు భరిస్తూ, దేశవ్యాప్తంగా 83 కోట్ల మందికి 5 కేజీల ఉచిత బియ్యాన్ని మోదీ ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న సన్న బియ్యం పంపిణీలో కూడా 60 శాతం ఖర్చు కేంద్రానిదేనని, ఇది అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా అని ఆయన సవాల్ విసిరారు. మరోవైపు, అంతర్జాతీయంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, రైతులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి బస్తాపై రూ.2500 సబ్సిడీని భరిస్తూ, 45 కేజీల యూరియాను కేవలం రూ.242కే అందిస్తోందని వివరించారు.

ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టబోయే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓట్లను తొలగించాలని చూస్తోందంటూ బూత్ లెవల్ ఆఫీసర్లుగా పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను సీఎం రెచ్చగొట్టడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ముఖ్యంగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల ఓట్లను వెతికి మరీ తొలగించాల్సిందేనని ఆయన కుండబద్దలు కొట్టారు. బంగ్లాదేశీయుల ఓట్లు తీసేస్తే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ కలుగుతోందని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా చూసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ తమ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుని అధికారులకు సహకరించాలి తప్ప, స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘంపై బురద జల్లడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ముడి చమురు ధరల పెరుగుదల అనేది అంతర్జాతీయ యుద్ధ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని, మనం 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. గతంలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి, వ్యాట్ తగ్గించాలని కోరినప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాలు తగ్గించాయి కానీ, తెలంగాణ మాత్రం తగ్గించలేదన్నారు. దేశంలోనే అత్యధికంగా ప్రతి లీటర్ ఇంధనంపై 35.20 శాతం (దాదాపు రూ.35) వ్యాట్ వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన కుండబద్దలు కొట్టారు. కేంద్రం వేస్తున్న ఎక్సైజ్ డ్యూటీ కేవలం రూ.6 నుంచి 7 మాత్రమేనని, కేంద్రాన్ని విమర్శించే ముందు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్ ఎందుకు తగ్గించదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.