- కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
- ఎస్ఆర్ డీపీ పనులకు తాత్కాలిక బ్రేక్
- చెట్లను నరకడంతో సైరంది కాదంటున్న పర్యావరణం ప్రేమికులు
- కౌంటర్ దాఖలుకు సన్నద్దమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, మహా : హైదరాబాద్లోని ప్రముఖ కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న చెట్లను నరకవద్దని ఆదేశిస్తూ న్యాయస్థానం స్టే విధించింది. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ సమీపంలో 35 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ టచ్ చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్ డీపీ) కింద పనులు ప్రారంభించింది. అయితే, ఈ నిర్మాణాల వల్ల పర్యావరణానికి, పార్కులోని జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సోమవారం స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు తాజాగా విధించిన స్టేతో కేబీఆర్ పార్క్ జంక్షన్ పరిసరాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఆర్డీపీ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను సుప్రీంకోర్టు జులై 27వ తేదీకి వాయిదా వేసింది.
జూబ్లిహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ కష్టాల నుంచి వాహన దారులను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణానికి నడుం కట్టింది. ఇందుకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించింది. అయితే పార్క్ పరిసరాలలో చెట్లను నరికి వేయడంతో గత కొంత కాలంగా పర్యావరణ ప్రేమికులు అందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలన్న సంకల్పంతో పాటు పర్యావరణానికి ఏ మాత్రం హామి జరుగకుండా పనులను చేపడుతున్నామని చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పర్యావరణ ప్రేమికులు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడంతో స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం నిర్ణయంపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది.








