- కుల గణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
- ఎవరెంత అనేది ప్రభుత్వానికి తెలియాలన్న కోర్టు
- కులగణన వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, మహా : దేశంలో జరుగుతున్న జనాభా గణనలో కులాల వివరాలను సేకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. సంక్షేమ చర్యలు చేపట్టాలంటే వెనుకబడిన కులాల్లో ఎంత మంది జనాభా ఉన్నారో ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. జనాభా గణన కుల ప్రాతిపదికన జరగాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. సుధాకర్ గుమ్ముల అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు తోసిపుచ్చింది.
కుల గణన వల్ల రాజకీయ ప్రయోజనాల కోసం డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పిటిషనర్ వాదించారు. కులాల వారీగా వివరాలు సేకరించడం వల్ల సామాజిక, రాజకీయ సమస్యలు తలెత్తుతాయని, కార్పొరేట్ సంస్థలు కూడా ఈ డేటాను తమ స్వార్థం కోసం వాడుకుంటాయని తన వాదనలో పేర్కొన్నారు. అయితే, ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల కూర్పును, వారి జనాభా విస్తృతిని నిర్ణయించడానికి ప్రభుత్వానికి ఇటువంటి డేటా చట్టబద్ధంగా అవసరమని కోర్టు పేర్కొంది. కుల గణనను 2027 జనాభా గణనలో చేర్చాలా వద్దా అనేది నిర్ణయించడం కోర్టు పరిధిలోకి రాదని సిజెఐ పేర్కొన్నారు. ఎవరెవరు వెనుకబడి ఉన్నారో తెలిసినప్పుడే ప్రభుత్వం సరైన సంక్షేమ పథకాలు రూపొందించగలదని ధర్మాసనం అభిప్రాయపడింది.
రాజకీయ ప్రాధాన్యత
సెన్సస్ లో కుల గణనను చేర్చాలన్న డిమాండ్ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అనేక రాజకీయ పార్టీలు కుల గణన కోసం పట్టుబడుతుండగా, సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆ వాదనలకు బలాన్ని ఇచ్చింది. కుల గణన డేటా వల్ల రిజర్వేషన్లు, విద్య, ఉపాధి వంటి రంగాల్లో వెనుకబడిన వర్గాలకు మరింత న్యాయం జరుగుతుందని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.సుప్రీంకోర్టు తీర్పుతో కుల గణనపై నెలకొన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయినట్లయ్యింది.







