Mahaa Daily Exclusive

  నేరాలకు దీటుగా టెక్నాలజీ పోలీసింగ్.

Share

• పోలీసు వ్యవస్థలో సమూల ప్రక్షాళన.
• కల్తీలు, సైబర్ క్రైమ్‌పై ఉక్కుపాదం!
• శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేదు.
• పోలీసు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం.
హైదరాబాద్, మహా.

దేశంలో నేరాల స్వరూపం వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, భవిష్యత్ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసు వ్యవస్థ సమూల ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, పటిష్టమైన నిఘా వ్యవస్థతో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేని పోరాటం చేయాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర భద్రతా సలహాదారు బి. శివధర్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌లతో పాటు అదనపు డీజీలు, ఐజీలు, కమిషనర్లతో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి పోలీసు శాఖలో తీసుకురావాల్సిన మార్పులపై సుదీర్ఘంగా సమీక్షించారు.
మారుతున్న నేరాల సరళిని అంచనా వేస్తూ, ముఖ్యంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ప్రత్యేక ఎంపిక ప్రక్రియ చేపట్టడంతో పాటు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో పోలీసు విభాగం కోసం ప్రత్యేక కోర్సును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పోలీసు యంత్రాంగం నిరంతర నిఘా నేత్రంలా పనిచేయాలని, డ్రోన్ పోలీసింగ్‌ను విస్తృతం చేయాలని సూచించారు. నూతన సాంకేతికత వినియోగం, సీసీ కెమెరాల సంఖ్య పెంపు, నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేయడం ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అత్యంత సమర్థవంతంగా వాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కాలానికి అనుగుణంగా ఫోరెన్సిక్, డేటా సెంటర్లను భారీగా పెంచుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.
కేవలం శాంతిభద్రతలే కాకుండా ప్రజారోగ్యం, భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న కల్తీ ఆహారం, ప్రమాదాలపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తీవ్ర స్థాయిలో స్పందించారు. కల్తీ ఆహారం వల్ల క్యాన్సర్ మహమ్మారి ఆందోళనకర స్థాయిలో ప్రబలుతున్న నేపథ్యంలో, దీని సూత్రధారులపై ఉక్కుపాదం మోపాలని, అవసరమైతే కల్తీ నిరోధానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. నగరంలో అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీల నియంత్రణపై జీహెచ్ఎంసీ, పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అగ్నిప్రమాదాలు జరిగాక స్పందించడం కాకుండా, ముందస్తు నివారణా చర్యలపై మున్సిపల్, హైడ్రా విభాగాలతో సమన్వయం చేసుకుంటూ జూన్ 15 లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఫైర్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు. నాలాలు, మ్యాన్ హోల్స్ నిర్వహణలో మెట్రో వాటర్ వర్క్స్, ట్రాఫిక్ పోలీస్, హైడ్రా, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అలాగే, మాదకద్రవ్యాల మహమ్మారి బారిన పడిన బాధితుల కోసం ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
పోలీసు శాఖలో సమూల సంస్కరణలు తీసుకువస్తూనే, అవినీతికి ఏమాత్రం తావులేకుండా కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే పోస్టింగ్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిపై, ఆర్గనైజ్డ్ క్రైమ్‌పై డేటా అనాలిసిస్ ఆధారంగా విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే విజిలెన్స్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. ఎస్‌ఐ నుంచి నాన్ క్యాడర్ ఐపీఎస్ వరకు పదోన్నతి పొందిన తర్వాత రెండేళ్ల పాటు ఇతర విభాగాల్లోనూ పనిచేసేలా మార్పులు తీసుకురావాలన్నారు. ఎస్పీలు నిరంతరం జిల్లాల్లో పర్యటించాలని, ఐజీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలని, క్రైమ్ రివ్యూ మీటింగ్‌లు క్రమం తప్పకుండా జరగాలని ఆదేశించారు. వీఐపీలు, సెలబ్రిటీల కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చే సమయంలో ట్రాఫిక్, భద్రతా సమస్యలు తలెత్తకుండా కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ విభాగాన్ని ఒకే యూనిట్ కిందకు తీసుకురావాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణ ఒక పవిత్ర బాధ్యతని, ఇందులో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచడం, గంజాయి రవాణాను కఠినంగా అడ్డుకోవడం, విలేజ్ పోలీసింగ్‌ను బలోపేతం చేయడంతో పాటు కాలం చెల్లిన ఆయుధాలను తక్షణమే తొలగించి వ్యవస్థను ఆధునీకరించాలని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థలో అందరూ భాగస్వాములే అని, పరిధి దాటి ప్రవర్తించే అధికారులను ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని హెచ్చరించారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, శాఖలో ఇకనుంచి అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ (ఈవీ) వాహనాలుగా మార్చాలని నిర్ణయించారు. పోలీసు వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.