Mahaa Daily Exclusive

  ఖజానాకు మద్యం కాసుల వర్షం…

Share

ఖజానాకు మద్యం కాసుల వర్షం.
* రికార్డు స్థాయిలో రూ. 44 వేల కోట్ల ఆదాయం.
* మందుబాబుల కిక్కు.. ప్రభుత్వానికి పసిడి పండుగ.
* గతేడాదితో పోలిస్తే అదనంగా రూ. 7 వేల కోట్ల రాబడి.
*మద్యం పాలసీ హిట్, బెల్ట్ షాపుల కట్టడితోనే అద్భుత ఫలితాలు.
* ఒక్క డిసెంబర్‌లోనే రూ. 5 వేల కోట్ల విక్రయాలు.
హైదరాబాద్, మహా
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రాబడిని ఆర్జించి రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఎక్సైజ్‌ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.44,557 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాదితో పోల్చి చూస్తే ఈసారి దాదాపు రూ.7 వేల కోట్ల అదనపు ఆదాయం రావడం గమనార్హం. మద్యం విక్రయాలు అమాంతం పెరిగిపోవడం వల్లే ఈ స్థాయిలో ఆదాయం రాలేదని, నూతన మద్యం పాలసీని పకడ్బందీగా అమలు చేయడం, బెల్ట్ షాపులను కఠినంగా నియంత్రించడం, అక్రమ మద్యం సరఫరాకు పూర్తిగా చెక్ పెట్టడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. దీనికితోడు ఎన్నికల హడావుడి, పండుగల సీజన్, నూతన సంవత్సర వేడుకలు సైతం ప్రభుత్వ ఆదాయాన్ని భారీగా పెంచాయి.
మొత్తం ఆదాయంలో అత్యధిక భాగం నేరుగా మద్యం విక్రయాల ద్వారానే సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్, బీర్ల అమ్మకాల ద్వారా రూ.40,209 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. అయితే, వినియోగం విషయంలో ఆసక్తికరమైన గణాంకాలు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే లిక్కర్ వినియోగం స్వల్పంగా రెండు శాతం మేర పెరగ్గా, వేసవిలో డిమాండ్ ఉన్నప్పటికీ బీర్ల అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.48 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోగా, తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 5.31 కోట్ల కేసులకు పడిపోయిందని ఎక్సైజ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3,08,291 వేల కేసుల లిక్కర్‌, 3,08,734 వేల కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు అధికారులు వివరించారు.
మద్యం విక్రయాలకు తోడు లైసెన్సింగ్ ప్రక్రియ ద్వారా కూడా ప్రభుత్వానికి భారీ స్థాయిలో కనకవర్షం కురిసింది. నూతన మద్యం దుకాణాల లైసెన్సుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 95,628 దరఖాస్తులు రాగా, కేవలం ఈ దరఖాస్తుల రుసుము రూపంలోనే రూ.2,869 కోట్ల రాబడి వచ్చింది. అలాగే రాష్ట్రంలో పనిచేస్తున్న 2,620 ఎ-4 రిటైల్ మద్యం దుకాణాల వార్షిక అద్దె ఫీజుల ద్వారా మరో రూ.1,771 కోట్లు, అనుమతి పొందిన 1,214 బార్ అండ్ రెస్టారెంట్ల వార్షిక లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.549 కోట్లు ఖజానాకు చేరాయి. పెద్ద మొత్తంలో లైసెన్స్ ఫీజులు రావడం ఆదాయం అమాంతం పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. జిల్లాల వారీగా విక్రయాలను పరిశీలిస్తే.. పట్టణీకరణ అధికంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోయింది.
డిసెంబర్ నెల రాష్ట్ర ఎక్సైజ్ చరిత్రలోనే అత్యధిక విక్రయాలు జరిగిన మాసాల్లో ఒకటిగా చరిత్రకెక్కింది. పంచాయతీ ఎన్నికలు, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు అన్నీ ఒకేసారి రావడంతో కేవలం డిసెంబర్ నెలలోనే రూ.5,051 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. బడ్జెట్ అంచనాల ప్రకారం ఎక్సైజ్ డ్యూటీల కింద ప్రభుత్వం భారీ వసూళ్లు ఆశించగా, రూ.23,359 కోట్లు ప్రత్యక్ష ఎక్సైజ్ సుంకంగా ఖజానాకు చేరాయి. ఏది ఏమైనప్పటికీ పన్ను లీకేజీలను అరికట్టడం, డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, మార్కెట్లోకి కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపడం లాంటి పటిష్టమైన చర్యల వల్లే ఈ చారిత్రక రికార్డు సాధ్యమైందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సగర్వంగా తెలియజేస్తున్నారు.