ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం!
* బూత్ స్థాయి నుంచే పార్టీ నిర్మాణం.
* గడపగడపకూ కేంద్ర ప్రభుత్వ పథకాలు.
* కోయంబత్తూరు వేదికగా బీజేపీ కీలక సమీక్ష.
* నేతలకు బీఎల్ సంతోష్, పొంగులేటి సుధాకర్ రెడ్డి దిశానిర్దేశం.
కోయంబత్తూరు, మే 21.
“తమిళనాడులో ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసినప్పుడే ప్రజల గుండెల్లో పార్టీకి సుస్థిర స్థానం దక్కుతుందని
జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) ఆదరణీయ బీఎల్ సంతోష్, బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కో ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్యుడి గడపకు చేర్చుతూ, ప్రతి పోలింగ్ బూత్ కేంద్రంగా పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి అంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది.
గురువారం కోయంబత్తూరులోని బీజేపీ జిల్లా కార్యాలయం వేదికగా జరిగిన అత్యున్నత స్థాయి కీలక సమీక్షా సమావేశంలో వారు భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. నాయకులు కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, సామాన్యులకు అండగా నిలవడమే పార్టీ తక్షణ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో మమేకం అయినప్పుడే తమిళనాట భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో అమితమైన విశ్వాసం కలుగుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్క నాయకుడు చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేయాలని ఆయన ఉద్బోధించారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంపై డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి లోతుగా విశ్లేషించారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ఆయన కీలక సూచనలు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ కమిటీలను మరింత చురుకుగా మార్చాలని, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న అద్భుతమైన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సంస్థాగతంగా పునాదులు బలంగా ఉన్నప్పుడే రాజకీయంగా మంచి ఫలితాలు సాధించగలమని, బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పొంగులేటి స్పష్టం చేశారు.
ఒక నది ప్రవాహంలా సాగిన ఈ సమీక్షా సమావేశంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జి అరవింద్ మీనన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ఉదకమండలం (ఊటీ) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే భోజరాజన్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసి, యువత, మహిళలను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆకర్షించేలా సరికొత్త ప్రణాళికలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నేతలు ఈ సమావేశం ద్వారా ఏకగ్రీవంగా నిర్ణయించారు.








