ఐఏఎస్ అధికారుల పిల్లలకు మళ్లీ రిజర్వేషన్లు ఎందుకు?
* ‘క్రీమీ లేయర్’ పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.
* దేశవ్యాప్తంగా సరికొత్త చర్చ!
ఢిల్లీ, మహా.
విద్యా, ఆర్థిక పురోగతితో సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న కుటుంబాలు.. తరతరాలుగా రిజర్వేషన్ల ప్రయోజనాలను ఆశించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైనప్పుడు, వారి పిల్లలకు మళ్లీ రిజర్వేషన్లు కోరడంలో అర్థం లేదని అత్యున్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. ఇలాగైతే మనం రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేమని వ్యాఖ్యానించింది. వెనుకబడిన తరగతుల్లోని ‘క్రీమీ లేయర్’ (సంపన్న శ్రేణి) వర్గాలను కోటాల నుంచి మినహాయించడానికి సంబంధించిన నిబంధనలపై దాఖలైన పలు పిటిషన్లను శుక్రవారం జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు సామాజిక న్యాయం, రిజర్వేషన్ల అమలు తీరుపై పలు కీలక, సంచలన వ్యాఖ్యలు చేసింది.
సామాజిక పురోగతి వచ్చిన తర్వాత కూడా కోటానా?
విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న మాట్లాడుతూ.. “తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నప్పుడు.. వారిలో సామాజిక పురోగతి ఆర్థిక అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. విద్యా, ఆర్థిక సాధికారతతో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కూడా వారు తమ పిల్లలకు రిజర్వేషన్లు కావాలని కోరుకుంటే, ఈ వ్యవస్థ నుండి మనం ఎప్పటికీ బయటపడలేం. ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం” అని వ్యాఖ్యానించారు. ఒక తరం రిజర్వేషన్ల ద్వారా ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత, వారి తదుపరి తరాలకు కూడా అదే ప్రయోజనాలు కల్పించడం ‘క్రీమీ లేయర్’ నిబంధనలకే విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది.
అట్టడుగు వర్గాలకు తీవ్ర అన్యాయం
ఒక కుటుంబంలో రిజర్వేషన్ల అండతో ఉన్నత స్థాయికి వెళ్లిన వారే పదే పదే అదే ఫలాలను చేజిక్కించుకుంటే.. అదే వర్గంలో అసలైన, అత్యంత పేదరికంలో మగ్గుతున్న వారికి తీరని అన్యాయం జరుగుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవస్థలో ఖచ్చితంగా కొంత సమతుల్యత ఉండాలని, కోటా ప్రయోజనంతో తల్లిదండ్రులు ఉన్నత స్థానాలకు వెళ్లినప్పుడు వారి పిల్లల సామాజిక, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ఫలాలు కేవలం కొందరికే పరిమితం కాకుండా, సమాజంలోని ఆఖరి వ్యక్తికి అందాలన్నదే అసలైన లక్ష్యం కావాలని సూచించారు.
ఈడబ్ల్యూఎస్ , క్రీమీ లేయర్ వేర్వేరు
ఈ విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. వ్యక్తులను వారి జీతం ఆధారంగా కాకుండా కేవలం హోదా (స్టేటస్) ఆధారంగా రిజర్వేషన్ల నుంచి మినహాయించడంపై లోతైన పరిశీలన అవసరమని కోరారు. క్రీమీ లేయర్ ప్రమాణాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేటగిరీ కంటే చాలా సరళంగా ఉండాలని వాదించారు. దీనికి జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సామాజిక వెనుకబాటుతనం ఉండదని, దానికి కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే కొలమానమని తేల్చిచెప్పారు. కానీ క్రీమీ లేయర్ అనేది కుల ఆధారిత సామాజిక వెనుకబాటుతనానికి, ఆర్థిక హోదాకు ముడిపడి ఉన్న అంశమని స్పష్టం చేశారు. అనంతరం, ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర సంబంధిత పక్షాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను వాయిదా వేసింది.
నేపథ్యం – ఇంద్ర సాహ్ని తీర్పు
1992లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక ‘ఇంద్ర సాహ్ని’ (మండల్ కమిషన్) తీర్పులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను సమర్థిస్తూనే.. వారిలోని ‘క్రీమీ లేయర్’ వర్గాలను మినహాయించాలని ఆదేశించింది. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వరుసగా మూడేళ్ల పాటు వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు దాటిన వారితో పాటు; ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, సైన్యంలో కల్నల్ ఆ పై స్థాయి అధికారుల పిల్లలను, వారి ఆదాయంతో సంబంధం లేకుండా క్రీమీ లేయర్‌గా పరిగణిస్తూ రిజర్వేషన్ల నుంచి మినహాయిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల హేతుబద్ధతపై మరోసారి తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది.







