Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో న్యాయవాది హత్య కేసులో పురోగతి.

Share

  •  వక్ఫ్ భూముల వివాదమే కారణమని ప్రాథమిక నిర్ధారణ.
  • నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాల ముమ్మర గాలింపు.

    హైదరాబాద్, మహా.
    హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. శనివారం తెల్లవారుజామున మాసబ్‌ట్యాంక్ పరిధిలోని శాంతినగర్‌లో ఉన్న తన నివాసం వెలుపల ఆయన దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం వేళ ఖాజా మొయినుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి, రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న తన కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఆయన కారు వెనుక డోర్ తెరిచి బ్యాగును లోపల పెట్టి, డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతున్న క్షణాల్లో.. అప్పటికే కొంతదూరంలో పొంచి ఉన్న ఒక స్కార్పియో వాహనం ఒక్కసారిగా అతివేగంతో దూసుకొచ్చింది. ఆ వాహనం మొయినుద్దీన్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టి, ఆగకుండా అక్కడి నుంచి వేగంగా పారిపోయింది. కారు బలంగా ఢీకొట్టడంతో ఆయన గాల్లోకి ఎగిరి రోడ్డుపై తీవ్ర గాయాలతో పడిపోయారు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
    మొదట దీనిని సాధారణ ‘హిట్ అండ్ రన్’ ప్రమాదంగా భావించినప్పటికీ, సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించిన నాంపల్లి పోలీసులు ఇదొక పక్కా స్కెచ్‌తో జరిగిన ముందస్తు ప్రణాళికాబద్ధమైన హత్యగా తేల్చారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మలక్‌పేట్ పరిధిలోని వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం, అక్రమ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఖాజా మొయినుద్దీన్ గత కొన్ని దశాబ్దాలుగా కోర్టుల్లో చట్టపరమైన పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ల్యాండ్ మాఫియా ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఖాజా మొయినుద్దీన్ కుమారుడు ఫర్హాన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఒక రాజకీయ నేతపై నేరుగా ఆరోపణలు చేశారు. వక్ఫ్ భూముల వివాదంలో సదరు నేత ఆరు నెలల క్రితమే తమ ఆఫీసుకు వచ్చి బెదిరించారని, గతంలోనూ తమపై దాడులు జరిగాయని, ఇది తన తండ్రిపై జరిగిన ఆరో దాడి అని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
    ఈ హత్య కేసు విచారణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వెస్ట్ జోన్ పోలీసులు, డిసిపి పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో హత్యకు వాడిన స్కార్పియో వాహనాన్ని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. ఆ కారు నంబర్ ఆధారంగా దాని అసలు యజమానిని అదుపులోకి తీసుకోగా, ఆయన ఆరు నెలల క్రితమే ఆ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయించినట్లు తెలిపాడు. అయితే కొనుగోలు చేసిన వ్యక్తులు ఇప్పటివరకు ఆ కారును తమ పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం గమనార్హం. హత్యకు వాడిన కారును కావాలనే పాత రిజిస్ట్రేషన్‌తోనే ఉంచి, ఐదుగురు సభ్యుల ముఠా ఈ ప్లాన్ అమలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కారు కొనుగోలు చేసిన ఆ గుర్తుతెలియని వ్యక్తుల అడ్రస్, హంతకుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ కేసులో ల్యాండ్ మాఫియాకు చెందిన ఇద్దరు అనుమానితులను ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని నగర పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.