రైతుల ప్రతి గింజా కొంటాం.
* కేంద్రానిది మాటలే.
• విద్యావ్యవస్థ ప్రక్షాళన.
• మూసీ నిర్వాసితులకు స్థానికంగానే ఇళ్లు.
• ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎంను కలిసింది. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయం, మూసీ పునరుజ్జీవం, విద్యావ్యవస్థ తదితర కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు.
**కేంద్రానిది మద్దతు ధరల ప్రకటన వరకే..**
కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించడమే తప్ప, రాష్ట్రంలో కనీసం 30 శాతం పంటను కూడా కొనుగోలు చేయడం లేదని ముఖ్యమంత్రి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై తాను ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హమాలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లడం, తీవ్రమైన ఎండల కారణంగా మధ్యాహ్నం వేళ పని నిలిచిపోవడం వల్ల కొనుగోళ్లలో స్వల్ప జాప్యం జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చి కొంటున్నామని, మొక్కజొన్నను సైతం మద్దతు ధరకు సేకరిస్తున్నామని గుర్తుచేశారు.
**స్థానికంగానే మూసీ నిర్వాసితులకు ఇళ్లు**
మూసీ నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. వారికి స్థానికంగానే నివాసాలు కల్పిస్తామని, ఈ సున్నితమైన అంశంపై పార్టీలు రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. మూసీ కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజలకు ప్రాణసంకటంగా మారిందన్నారు. పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని సీఎం వివరించారు.
**ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రక్షాళన**
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ పనితీరును పరిశీలించేందుకు ఆరుట్ల పాఠశాలను ఒకసారి సందర్శించాలని సీపీఎం నేతలకు ఆయన సూచించారు.
ఈ సమావేశంలో సీపీఎం ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పి. సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వరాజ్యం, ఎం. గోపాలరావుతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.








