Mahaa Daily Exclusive

  నీది మిషన్ మోడ్ కాదు..కమీషన్ మోడ్…

Share

నీది మిషన్ మోడ్ కాదు..కమీషన్ మోడ్.
* తాలు పేరిట నిలువు దోపిడీ.
* రోహిణి కార్తె వచ్చినా కళ్లాల్లోనే ధాన్యం.
* రైతుల ఉసురు తీస్తున్న కాంగ్రెస్.
* రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు నిప్పులు.
సిద్దిపేట, మహా.
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, ఐకేపీ సెంటర్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్‌ను ఆయన స్వయంగా సందర్శించారు. వరి ధాన్యాన్ని పరిశీలించి, అక్కడి రైతుల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై హరీశ్ రావు ఘాటు విమర్శలు చేశారు.
**అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం**
రైతులకు సాగునీరు, కరెంట్, యూరియా అందించడం దగ్గరి నుంచి పండిన పంటను సేకరించే వరకు ప్రతి దశలోనూ రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. రోహిణి కార్తె ప్రవేశించినా ధాన్యం ఇంకా కళ్లాల్లోనే ఉండిపోవడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ఎండకన్నా, వానకన్నా రైతులు అరిగోస పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
**మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలు సరికాదు..**
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి, ఇప్పుడు కేవలం 70 లక్షల టన్నులే కొంటాం అనడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే, మిగిలిన 30 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు ఏం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై నెపం నెట్టడం ఆపి, వారి మెడలు వంచైనా సరే ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు.
**తాలు పేరిట నిలువు దోపిడీ**
“తాలు పెడితే తోలు తీస్తా” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని, క్షేత్రస్థాయిలో సిద్దిపేట నియోజకవర్గంలోనే క్వింటాల్‌కు ఏకంగా 5 కిలోల చొప్పున తరుగు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని మండిపడ్డారు. ఈ జాప్యం వల్ల వరి కుప్పలపైనే గుండెలు బాదుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.
**సీఎంవి ఢిల్లీ ట్రిప్పులే..**
ధాన్యాన్ని ‘మిషన్ మోడ్‌’లో కొంటున్నామనే సీఎం వ్యాఖ్యలను హరీశ్ రావు తిప్పికొట్టారు. ఇది మిషన్ మోడ్ కాదని, పూర్తిగా ‘కమీషన్ మోడ్’ అని ఆరోపించారు. కేబినెట్ మీటింగ్‌లో ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన నిర్ణయం వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలిందన్నారు. 45 రోజుల్లో రైతుబంధు నిధులు వేస్తామని దేవుడి మీద ఒట్టు వేసి 60 రోజులు గడిచినా మాట తప్పారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి కేవలం ఒక “పేపర్ టైగర్” మాత్రమేనని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన ఢిల్లీ ట్రిప్పులను పక్కనబెట్టి, కళ్లాల్లో ఉన్న వడ్లను తరలించడానికి లారీల ట్రిప్పులను పెంచాలని హితవు పలికారు.
**కలెక్టరేట్లను దిగ్బంధిస్తాం: హరీశ్ రావు హెచ్చరిక**
రాజకీయ విమర్శలు పక్కనబెట్టి రైతుల సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గాలు చూపాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఒకటి రెండు రోజుల్లో కొనుగోళ్లలో మార్పు రాకపోతే, సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట నిరవధిక ధర్నాకు దిగుతానని స్పష్టం చేశారు. వేలాది మంది రైతులతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు.